ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన తొమ్మిదిమంది వృద్ధులు తుదిశ్వాస విడిచారు. గురువారం గుంటూరు జిల్లా వేమూరు మండలం కుచ్చెళ్లపాడుకు చెందిన షేక్ బీజాన్‌బీ(100) కుటుంబసభ్యుల సాయంతో పోలింగ్ బూత్‌లోకి వెళ్తూ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలొదిలారు. అదే జిల్లా అమరావతి మండలం కర ్లపూడికి చెందిన రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి దేవరకొండ ప్రసాద్(70) మనవరాళ్లతో పోలింగ్ బూత్‌కు వెళ్లి సిబ్బందికి గుర్తింపుకార్డు చూపిస్తూనే కుప్పకూలి మరణించారు. తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం కేఈ చిన్నయ్యపాలెంకు చెందిన శీరం మాణిక్యం(64) పోలింగ్ క్యూలో ఎండ తీవ్రతకు సొమ్మసిల్లి పడిపోయారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. కృష్ణాజిల్లా ఆత్కూరు గ్రామానికి చెందిన షేక్ మస్తాన్(57) క్యూలో విపరీతంగా చెమటలు పట్టి గుండెపోటుతో కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించేలోగానే మరణించారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తొలుసూరుపల్లికి చెందిన బగాది సరస్వతి(85) కుటుంబసభ్యుల సాయంతో వీల్‌చైర్‌లో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. తిరిగి ఇంటికి వెళ్తూ మార్గం మధ్యలోనే ఆమె మరణించారు. కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం మోగులూరుకు చెందిన బోజేడ్ల లీలావతి(75) ఎండ 40 డిగ్రీలు ఉందని కుటుంబసభ్యులు వారిస్తున్నా పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఓటు వేసి బయటకు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలిస్తుండగానే ఆమె మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో పెద్దపంజాణి మండలం ముత్తుకూరుకు చెందిన మొగిలమ్మ(85) ఓటు వేసి ఇంటికి వెళ్లగానే వడదెబ్బతో మృతి చెందారు. అనంతపురం జిల్లా రొద్దం మండలంలో మండ్లి గంగమ్మ(70) ఉదయం 11 గంటలకు జెడ్పీ స్కూల్‌లో ఓటు వేసి ఎండలో ఇంటికి తిరిగివచ్చి ప్రాణాలు వదిలారు. పోలింగ్ కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలు కల్పించనందునే వృద్ధులు వడదెబ్బకు మరణించారని వారి కుటుంబసభ్యులు ఆరోపించారు.
చివరి ఓటు చంద్రబాబుకే.. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన బండారు ముసలయ్య(75) ‘పింఛన్ పెంచిన చంద్రబాబునే గెలిపించాలి.. మా బాబునే గెలిపించాలి..’ అంటూ ఎన్నికల ముందు నుంచి అందరికీ చెబుతూ ఉండేవారు. గురువారం ఉదయం 10 గంటలకు ఆయన హుషారుగా నడుచుకుంటూ గ్రామంలోని 15వ నంబరు పోలింగ్‌బూత్‌కు వెళ్లి ఓటు వేశారు. అంతే ఉత్సాహంగా బయటకు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయన మరణించినట్టు తెలియడంతో కుటుంబ సభ్యులు ఘొల్లుమన్నారు. చంద్రబాబును గెలిపించాలంటూ ఉదయం కూడా హడావుడి చేశాడని కన్నీరుమున్నీరుగా విలపించారు.