కర్ణాటకలో ఎలా అయినా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అని అమిత్ షా చేసిన శపధం మాత్రం నెరవేరటం లేదు. నాలుగు నెలల క్రితం, అధికారం కోసం వీళ్ళు పడిన పాట్లు చూసాం. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మల్యేలను కొనటానికి చేసిన ప్రయత్నాలు అన్నీ రివర్స్ అయ్యి, వీళ్ళు చేసిన బేరాలు అన్నీ బయట పడ్డాయి. అప్పటి నుంచి కుమారస్వామిని దించటానికి అమిత్ షా గ్యాంగ్ పని చేస్తూనే ఉంది. ఎమ్మల్సీ ఎన్నికలు రావటంతో, మరోసారి రంగంలోకి దిగారు. పదిరోజులుగా ముంబై రిసార్టు రాజకీయం అని, విధానపరిషత్ ఎన్నికలలో అభ్యర్థులను రంగంలోకి దించుతామని మీసాలు తిప్పిన కమలనాథులు నామినేషన్‌ల చివరిరోజైన సోమవారం కనిపించకుండా పోయారు.
దీంతో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి మరింత కాలం ఢోకాలేదనేది తేలిపోయింది. గత మూడు రోజులుగా సంకీర్ణం కూలిపోతుందనే బెంగతో గడిపిన కాంగ్రెస్‌నేతలు ఆ బెదిరింపులన్నీ ఉత్తుత్తివని తేలిపోవడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. మంత్రివర్గ విస్తరణ వైపు దృష్టిసారించారు. శాసనసభసభ్యుల నుంచి ఎన్నిక జరిగే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అక్టోబరు 4న పోలింగ్ జరగాల్సి ఉండగా, సోమవారం నామినేషన్‌ల దాఖలుకు చివరి రోజు కావడం గమనార్హం. 104మంది ఎమ్మెల్యేలు కలిగిన బీజేపీ మరో 8మంది మద్దతు పొందేందుకు నాలుగురోజులుగా భారీగానే కసరత్తు జరిపింది. ఏకంగా పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముంబైకు చేరారని ప్రచారం జరిగింది.
అయితే వారెవనేది మాత్రం తేల్చలేక పోయారు. ఇక చెన్నై మీదుగా ముగ్గురు ఎమ్మెల్యేలు ముంబై వెళతారనే సమాచారం హల్‌ఛల్ చేసింది. వారు బెంగళూరు శివారు హోసూరుకు చేరేసరికే అగ్రనేతల నుంచి పిలుపు రావడంతో వెనుతిరిగి బెంగళూరుకు చేరారు. ఇలా మూడు రోజులుగా సాగిన రిసార్టు రాజకీయం ప్రచారం మినహా ఆచరణలో సాధించింది శూన్యం. 104మంది ఎమ్మెల్యేలు కలిగిన బీజేపీ మరో 8మంది మద్దతుతో మూడు ఎమ్మెల్సీ స్థానాలను ఎలా పొందలేక పోయిందో అదే రీతిన సంకీర్ణ ప్రభుత్వాన్ని సైతం కూల్చడం అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. దీనిని బట్టి రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి మరింత కాలం ఢోకాలేదనేది తేలిపోయింది. బీజేపీ వ్యూహాలు ప్రతి అంశంలోను బెడిసి కొడుతుండటంతో కాంగ్రెస్, జేడీఎస్ అగ్రనేతలకు తమ ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరనే ధీమా ఏర్పడింది.