నాలుగు నెలల క్రితం కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఫలితాలు వచ్చిన రోజు, బీజేపీ నేతల ఓవర్ ఆక్షన్ గుర్తుందా ? ఫలితాలు రాక ముందో, రాం మాధవ్ లాంటి వాళ్ళు ఎలా రేచ్చిపోయారో చూసాం. దక్షిణాదిన దండయాత్రకు వస్తున్నాం కాచుకో చంద్రబాబు అంటూ, వార్నింగ్ ఇచ్చాడు. తీరా ఫలితాలు వచ్చిన తరువాత బొక్క బోర్లా పడ్డారు. తెలుగు వారు గణనీయంగా ఉన్న కర్ణాటకలో, చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో, చాలా వరకు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసారు. ఇదే బీజేపీ కొంప ముంచింది అంటూ, కర్ణాటక బీజేపీ నేతలు కూడా వాపోయారు. అయితే, తాజగా మరోసారి కర్ణాటకలో, బీజేపీకి చావు దెబ్బ తెగలింది.
కర్ణాటక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఘోరమైన ఫలితాలు వస్తున్నాయి. నేడు వెలువడుతున్న ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. 29 సిటీ పురపాలక సంస్థలు, 53 పట్టణ పురపాలక సంస్థలు, 23 నగర పంచాయతీల్లోని వార్డులు, మైసూరు, తమకూరు, శివమొగ్గ నగరపాలికల్లోని 135 వార్డులు అన్ని కలిపి మొత్తం 2,709 వార్డుల్లో ఆగస్టు 31న ఎన్నికలు జరిగాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ 913 వార్డుల్లో విజయం సాధించగా.. భాజపా 855 చోట్ల గెలుపొందింది. జేడీఎస్ 330 స్థానాల్లో విజయం సాధించగా.. బీఎస్పీ 13, ఇతరులు 36 చోట్ల గెలుపొందారు.
307 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. శివమొగ్గ నగరపాలక సంస్థను భాజపా కైవసం చేసుకుంది. శివమొగ్గలో మొత్తం 35 డివిజన్లకు గాను భాజపా 20, కాంగ్రెస్ 7, జేడీఎస్ 1, స్వతంత్రులు 6 డివిజన్లలో గెలుపొందారు. ఎన్నికల ఫలితాలపై మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత యడ్యూరప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వం వల్ల భాజపా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయిందని, అయితే 2019లో ఇలా జరగబోదని ధీమా వ్యక్తం చేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో భాజపా కచ్చితంగా విజయం సాధిస్తుందన్నారు.