జగన్ కరడుగట్టిన నేరస్థుడు. పులివెందులను కేంద్రంగా మార్చుకున్నారు. అటువంటి వ్యక్తికి ఓటేస్తే రాష్ట్రాన్ని తాకట్టుపెడతారు.’’ అంటూ చంద్రబాబు విమర్శించారు. కర్నూలు, అనంతపురం, కడప ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ఆయన వైకాపాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బూత్ కన్వీనర్ల, సేవామిత్రల టెలికాన్ఫరెన్సులోనూ మాట్లాడారు. జగన్‌కి ఓటేస్తే అభివృద్ధి ఆగిపోతుందని చెప్పారు. ‘‘తండ్రిని అడ్డం పెట్టుకొని రూ.లక్ష కోట్లు సంపాదించిన వ్యక్తి వల్ల అధికారులు, పారిశ్రామికవేత్తలు జైలుకెళ్లారు. అటువంటి వ్యక్తిని గెలిపించాలా?’’ అని ప్రశ్నించారు. ప్రత్యర్థులు మైండ్ గేమ్ ఆడతారని, కల్పిత సర్వేలపై తెదేపా నాయకులు ఎవరూ కంగారు పడవద్దని చెప్పారు. బనగానపల్లి తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి సభలో ఉండగానే ‘బనగానపల్లిలో తెదేపాకు షాక్’ పేరిట సాక్షి టీవీలో ప్రసారమైన క్లిప్‌ను ఆయన చూపించారు.
‘‘ఆ పత్రిక, టీవీలకి ఏమైనా ధర్మం ఉందా? నిజాయతీ ఉందా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలని ఇంటింటికి తీసికెళ్లవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. మొదటిసారి డ్రైవర్లను గౌరవించి ఆటోలు, ట్రాక్టర్లకు పన్ను రద్దు చేశామన్నారు. నేనే నంబర్ వన్ డ్రైవర్ని.. డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా తీసుకువెళితే, ఐదు కోట్ల మందికి ఆనందం, ఆరోగ్యం ఇచ్చి ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘‘నాకు రిటర్న్‌గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ అన్నారు. ఆయన ఒకటిస్తే, బదులుగా నేను పది గిఫ్ట్‌లు సిద్ధంగా ఉంచుతాను. ఇక్కడి ప్రజల్లో ఆక్రోశం చూసి కేసీఆర్ తోక ముడిచారు. తెలంగాణలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బెదిరించి చేర్చుకుంటున్నారు. అక్కడ 16 ఎంపీ సీట్లు గెలిచి దేశంలో కేసీఆర్ చక్రం తిప్పుతారట. తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ పనులు చేయకుండానే కేసీఆర్ 88 సీట్లు గెలిస్తే, అన్నీ చేసిన మనం అత్యధిక అసెంబ్లీ స్థానాలతోపాటు, 25 ఎంపీ స్థానాలు గెలిచి తీరాలి. తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ఎన్నికలతో సంబంధం లేదని కేసీఆర్ అంటారు. ఆయనకు ఇక్కడి వైకాపాకు డబ్బులు పంపడంలో సంబంధం లేదా? తెదేపా డేటాను చోరీ చేసి వైకాపాకు ఇవ్వడంలో సంబంధం లేదా? పోలవరాన్ని అడ్డుకోవడంలో సంబంధం లేదా? నవ్యాంధ్ర ప్రజల ఆత్మగౌరవం కోసం ఎంతటి వారినైనా ఢీ కొంటాం’’ అని చంద్రబాబు హెచ్చరించారు.
‘‘జగన్ కరడుగట్టిన నేరస్థుడు.. నేరాలకు పులివెందులను కేంద్రంగా మార్చుకున్నారు.’’ అని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు.కడప మునిసిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన తెదేపా కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ వివేకా హత్యపై చంద్రబాబు మాట్లాడారు. ‘‘పులివెందులలోని ఇంట్లో వివేకాను క్రూరంగా చంపేశారు.దాన్ని గుండెపోటుగా కొందరు చిత్రీకరించారు. పోలీసులు రాకముందే గది శుభ్రం చేస్తారు.అరాచకానికిది పరాకాష్ఠ కదా. ఇవన్నీ లోటస్‌పాండ్‌లో ఉండే జగన్‌కు తెలియకుండానే జరిగాయా..? చివరకు ఏమీ పట్టించుకోవద్దంటూ ఎసీˆ్పకి ఫోన్ చేస్తారు. పోస్టుమార్టానికి వెళ్లాక మాట మార్చారు.. నేను, ఆదినారాయణరెడ్డి, సతీష్‌కుమార్‌రెడ్డి చంపేశామంటారు.. చనిపోయింది వాళ్లింట్లో.. చంపింది వాళ్లింట్లో.. శుభ్రం చేసింది వాళ్లు.. కుట్లు వేసింది వాళ్లు.. కట్లు కట్టింది వాళ్లు.. ఏమిటీ ప్రవర్తన.. ఆఖరుకు దాన్ని గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారో సమాధానం చెప్పాలి..’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘ఉదయం 9.17 గంటలకు సాక్షిటీవీలో ఆ విధంగా వేశారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వివేకా రాసినట్లుగా చెబుతున్న లేఖపై స్పందిస్తూ.. ‘‘సాయంత్రం ఓ లేఖ ఇస్తారు.. ఆయన చనిపోయే ముందు రాసిన లేఖ అని చెబుతారు. అంతా డ్రైవర్ మీద పెట్టాలనుకుంటున్నారా.. ఎంత దుర్మార్గం. మీ ఇంట్లో వాళ్ల పాత్ర లేకపోతే ఎందుకు రక్తాన్ని కడిగారు? సాక్ష్యాల్ని తారుమారు చేశారు. మీ మామ ఆసుపత్రి నుంచి బ్యాండేజ్‌లు తెచ్చి కట్టారు.. ఎందుకు గుండెపోటుగా చిత్రీకరించారు..వీటికి సమాధానం చెప్పాలి.’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ విషయంలో జగన్ భయంతో తప్పించుకుంటూ ఊరూరూ వెళ్లి సమావేశాలు పెడుతున్నారని విమర్శించారు.