పార్లమెంట్ లోపల, బయట ఎంపీల ఆందోళనలు, ధర్నాలు, ఉద్యమాలతో ఇక పనికాదు. ఎన్‌డీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాధించుకునేదేం ఉండదు. సాంకేతిక సాకులతో విభజన హామీల అమలు సాధ్యం కాదని ఇప్పటికే తేల్చిచెప్పేసిన ఎన్‌డీఏ నుంచి ఇంతకంటే మెరుగైన ఫలితాన్ని ఆశించడం వ్యర్థం. ఇందుకు బదులుగా ప్రజాక్షేత్రంలోకే దూకాలి. రానున్న ఎన్నికల్ని రాష్ట్రంలోని పార్టీలు సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. తదుపరి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలకపాత్ర పోషించాలి. ప్రధాని ఎవరన్నది రాష్ట్ర పార్టీలే నిర్ణయించే స్థాయికి చేరుకోవాలని పరిశీలకులు ఉద్బోధిస్తున్నారు. ఇది ఒక్కటే ఢిల్లీని ఎదుర్కుని, మనం సాధించుకునే అవకాశం. రేపు ఎవరు వచ్చినా, ఇలా సాగదీసే పనులే చేస్తారు. మన బలంతో ప్రభుత్వం ఏర్పాటు అయితేనే, మనం సాధించుకోగలం.
గత ఆరుమాసాలుగా తెలుగుదేశం పార్టీ ఒకే లక్ష్యంతో రాజకీయాలు చేస్తుంది. విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఉద్యమాలకు దిగింది. కేంద్రం కూడా ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కొందరు మంత్రులతో త్వరలోనే హామీల్ని అమలు చేస్తామంటూ ప్రకటనలు ఇప్పిస్తోంది. మరోవైపు మరికొందర్ని బరిలో దింపి అలాంటి అవకాశాలు లేనేలేవంటూ తేల్చేస్తోంది. గత నాలుగేళ్ళుగా ఊరించిన ప్రత్యేకహోదాకు సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయంటూ సాక్షాత్తు ప్రధానే అత్యున్నత చట్టసభలో చెప్పేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు కేంద్రం సిద్ధంగానే ఉందని, కావాలనే నిర్మాణ బాధ్యతను రాష్ట్రం తలకెత్తుకుంది.. కేంద్ర చట్టాల మేరకు డబ్బులిస్తాం.. అయితే అందుకు అనుగుణంగా నిర్మాణానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మాకివ్వడం లేదంటూ ఆరోపణలకు దిగింది. దీంతో పోలవరం జాప్యానికి కారణాన్ని రాష్ట్రంపైకి నెట్టేసింది.
ఇంతవరకు రైల్వేజోన్ అడ్రస్ లేదు. కాకినాడ పెట్రో కారిడార్ నిర్మాణానికి కూడా సాంకేతిక అవరోధాల్ని సాకుగా చూపించింది. దుగరాజపట్నం రేవులో పోర్టు నిర్మాణానికి పరిస్థిితులు అనువుగా లేవంటూ సాకు చెప్పింది. అలాగే కడప ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణం ఆమోదయోగ్యం కాదని నివేదికలు పేర్కొన్నాయని తేల్చేసింది. దీంతో విభజన హామీల్లో ఏ ఒక్కటీ అమలయ్యే అవకాశాల్లేవని తేలిపోయింది. అయినా ఇంకా ఎంపీలు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. విభజన హామీల్ని అమలు చేయమంటూ రోజూ వినతిపత్రాలు ఇస్తూనే ఉన్నారు. ఇక ఎన్‌డీఏ ప్రభుత్వానికి కూడా కాలపరిమితి ముగుస్తోంది. ఈ పరిస్థితుల్లో సమయాన్ని వృధా చేసు కోకుండా నేరుగా ప్రజాక్షేత్రంలోకెళ్ళి హామీల అమల్లో మరింత సమర్ధవంతంగా ఎండగట్టాల్సిన అవసరముందని పరిశీలకులు సూచిస్తున్నారు. రాష్ట్రానికి అన్యాయం చేయడంలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండూ దొందుగానే మారాయి. ఇక జాతీయ పార్టీల పట్ల ఆంధ్రప్రదేశ్‌లో విశ్వాసం కొరవడింది. దీన్ని ఆలంబనగా చేసుకుని జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ చక్రం తిప్పాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అప్పుడు తప్ప రాష్ట్రానికి పెండింగ్ ప్రాజెక్టులు మోక్షం సాధించలేవు. విభజన హామీలు అమల్లోకి రావని పరిశీలకులు తేల్చేస్తున్నారు.