రాష్ట్రంలోని లక్షా 20 వేల మంది అవయవ దానానికి ముందుకు వచ్చి.. చాటిన ఉదారత చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆనందాన్ని వెల్లిబుచ్చారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద నిర్వహించిన ఒక కార్యక్రమంలో అవయవ దాతలు ఇచ్చిన అంగీకార పత్రాలను ముఖ్యమంత్రి సమక్షంలో జీవన్ దాన్ సంస్థకు పట్టణ పేదరిక నిర్ములన సంస్థ (మెప్మా) అందజేసింది. పది రోజుల క్రితం ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు... పట్టణ ప్రాంతాల్లో అవయవ దానం కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమాన్ని పట్టణ పేదరిక నిర్ములన సంస్థ (మెప్మా) ఉద్యమంలా చేపట్టడంతో కేవలం 10 రోజుల వ్యవధిలోనే స్వచ్చంధగా తమ అవయవాలను దానం చేసేందుకు లక్షా 20 వేల మంది దాతలు ముందుకు వచ్చారు. నేటి నుంచి అవయవ దానం వారోత్సవాల నేపథ్యంలో అవయవ దానాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.
మరణించే వ్యక్తి తన అవయవాలను దానం చేసే సంప్రదాయం ప్రజల్లో మరింత పెరగాలని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల మనస్సుల్లో నుంచి మూఢనమ్మకాలను పారద్రోలి.. వాటి నుంచి ప్రజలను చైతన్యం చేసి అవయవ దానం వైపు మరలించాలన్నారు. ఇటువంటి కార్యక్రమంలో మెప్మా పాల్గొడం.. సమాజానికి సేవ చేయాలని ముందుకు రావడం చాల గొప్ప విషయం. మెరుగైన జీవన ప్రమాణాలు రావడానికి ఆదాయం కూడా పెరిగే అన్ని మార్గాలను ప్రభుత్వం అమలు చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. తానూ కూడా అవయవ దానాన్ని ఇవ్వడానికి ముందుకు వస్తున్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి ఈ సందర్భంలో ప్రకటించిడం విశేషం. ఈ కార్యక్రమంలో వచ్చిన సూచన మేరకు అవయవ దానంను పాఠ్యాంశాల్లో ఒక అంశంగా పెడతామని ముఖ్యమంత్రి తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లో అవయవదానం ఒక షరతు గా పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
అవయవ దానంపై మరింతగా చర్చ జరగాలి... మరో వారంలో వచ్చే అవయవ దాన దినోత్సవం నాటికి రాష్ట్రమంతా భారీగా దాతలను నమోదు చేయించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు... ఇలా అవయవాల దానం గురించి విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద రావు అన్నారు. అవయవ దానం కార్యక్రమానికి జీవన మిత్ర అనే వ్యవస్థ ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్లాలని స్పీకర్ సూచించారు. అవయవ దాతలకు నగదు రూపం లోనే కాకుండా ఇతరత్రా ప్రోత్సాహం కూడా ఇవ్వాలన్నారు. రాబోయే శాసనసభ సమావేశాల్లో కూడా రెండు గంటల పాటు ఈ అంశంపై చర్చ జరగాలని అభిలషిస్తున్నట్టు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రతిష్టాత్మకమైన ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్ లో నమోదు చేస్తున్నట్టు ఈ సందర్భంగా ఢిల్లీకి చెందిన ఆ సంస్థ ప్రతినిధి రాకేష్ వర్మ ప్రకటించారు.