తుఫానుతో ప్రభావితమయ్యే జిల్లాల ప్రజలకు సత్వర సేవలందించేందుకు ఎన్నికల కోడ్‌కు మినహాయింపు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ)ని కోరారు. తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై తుఫాను ప్రభావం ఉన్న నేపథ్యంలో ఆ నాలుగు జిల్లాలకు ఎన్నికల కోడ్ నుంచి వెసులుబాటు ఇవ్వాలన్నారు. తద్వారా ప్రజలకు వేగంగా సమాచారం అందించడం, అవసరమైన సరుకుల తరలింపు, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వంటివి సాధ్యపడతాయని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు కూడా ముగిసినందున.. ఫణి తుఫాను నేపథ్యంలో నియమావళికి సడలింపు ఇవ్వాలని కోరారు.
ఈమేరకు ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాకు సీఎం బుధవారం లేఖ రాశారు. ‘పెనుతుఫాను నాలుగు జిల్లాలపై ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ అంచనా. 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతోంది. కోడ్‌కు మినహాయింపు ఇస్తే మంత్రులు, అధికారులు వేగంగా స్పందించి ప్రజలకు ఉపశమనం ఇచ్చే సహాయక చర్యలు చేపట్టగలుగుతారు. తుఫాను సమయంలో వేగంగా స్పందించేందుకు కోడ్‌కు మినహాయింపు ఇవ్వండి’ అని కోరారు. అయితే చంద్రబాబు ఉత్తరం రాసి, రెండు రోజులు అవుతున్నా , ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి స్పందన లేదు. మరో పక్క ప్రధాని మోడీ సమీక్ష చేస్తున్నారు. మరి ఒక ముఖ్యమంత్రికి లేని అధికారం, ప్రధాన మంత్రికి ఎక్కడ నుంచి వచ్చిందో ఈసీనే చెప్పాలి.
ఇది ఇలా ఉంటే, తుఫాన్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించేందుకు, చురుగ్గా సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా కోస్తా ప్రాంత జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ను ఎత్తివేయాలని ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. వెంటనే ఒరిస్సాలో కోడ్ ఎత్తేసారు. మరి అదే ప్రభావం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పై ఉంటుంది, మినహియింపు ఇవ్వండి అని చంద్రబాబు కోరినా, ఈసీ పట్టించుకోకపోవటం వెనుక రాజకీయం కోణం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నవీన్ పట్నాయక్ ప్రస్తుతం ఎవరి ఫ్రంట్ లోనూ లేరు. తటస్థంగా ఉన్నారు. సీట్లు తగ్గితే, ఆయన్ను మంచి చేసుకువచ్చు అనే ఉద్దేశంతోనే, నవీన్ కు దగ్గర కావటానికి, మోడీ వేసిన ఎత్తుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ అయితే, చంద్రబాబుతో ఎలాంటి లాభం ఉండదు కాబట్టి, ఇక్కడ చంద్రబాబుని, ఏపి ప్రజలని ఇబ్బంది పెడుతున్నారు.