విభజన హామీల్లో కేంద్రానికి రూపాయి ఖర్చు లేనిది, ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకుంటే ఇచ్చేసేది, విశాఖ రైల్వే జోన్ అంశం. కాని, నాలుగేళ్ల నుంచి, దీని పై తేల్చటం లేదు. పైగా, ఒరిస్సా రాష్ట్రం పై తోస్తున్నారు. రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఏమో, పరిశీలించమని చట్టంలో ఉంది, పరిశీలిస్తూనే ఉంటాం అని వెటకారపు సమాధానం చెప్తారు. అయితే, నిన్న ఒరిస్సా రాష్ట్రం చెప్పిన విషయంతో, కేంద్రం డ్రామాలు అన్నీ బట్టబయలు అయ్యాయి. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వేజోన్ ఏర్పాటు చేయడానికి తమకేమీ అభ్యంతరంలేదని ఒడిశా అధికార బిజూ జనతాదళ్ సీనియర్ ఎంపీ ప్రసన్నకుమార్ పట్సానీ పార్లమెంటు స్థాయీసంఘం ముందే కుండబద్దలు కొట్టారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలుపై గురువారం సాయంత్రం పార్లమెంటు భవనంలోని 63వ నంబర్ మందిరంలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలో పార్లమెంటు స్థాయీసంఘం సమీక్ష నిర్వహించింది. ఇందులో శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడుతోపాటు, 13 కేంద్రమంత్రిత్వశాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో, బీజేడీ ఎంపీ ప్రసన్నకుమార్ పట్సానీ మాట్లాడుతూ ‘‘విశాఖపట్నం మంచి నగరం. దానికి కొత్త రైల్వేజోన్ ఇవ్వడానికి మాకేమీ అభ్యంతరంలేదు. రైల్వేశాఖ దగ్గర కూడా డబ్బులున్నాయి. జోన్ ఏర్పాటుచేయడానికి ఇంకెందుకు ఆలస్యం’’అని కేంద్ర రైల్వేశాఖ అధికారులను అందరి ముందు ప్రశ్నించారు.
విభజన చట్టం అమలు సమీక్ష సమయంలో రైల్వేజోన్ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ప్రసన్న కుమార్ పట్సానీ మాట్లాడుతూ విశాఖ రైల్వేజోన్‌ను తామేమీ వ్యతిరేకించడంలేదని స్పష్టం చేశారు. అప్పుడు రామ్మోహన్‌నాయుడు జోక్యం చేసుకుంటూ ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఇద్దరూ ఇక్కడే ఉన్నాం... ఇద్దరూ ముక్తకంఠంతో జోన్ ఏర్పాటుచేయాలని కోరుతున్నప్పుడు మీరెందుకు నిర్ణయం తీసుకోరని రైల్వే అధికారులను ప్రశ్నించారు. అందుకు ఆ శాఖ తరుఫున హాజరైన డైరక్టర్ స్థాయి అధికారులు స్పందిస్తూ రైల్వేజోన్ ఆర్థికంగా లాభదాయకం కాదని నివేదిక వచ్చిందని, అయినప్పటికీ తమ మంత్రి దానిపై కసరత్తు చేస్తున్నారని పాత సమాధానమే ఇచ్చారు. సమావేశంలో పాల్గొన్న అధికారులను స్థాయీ సంఘం సభ్యులంతా పెండింగ్ అంశాల అమలు తీరుపై ఆరాతీశారు.