నిరుద్యోగ యువతకు రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అందిస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు ఒడిశా ప్రభుత్వ అధికారుల బృందం రాష్ట్రానికి మంగళవారం వచ్చింది. ఇటీవల విడుదల చేసిన ఇండియా స్కిల్స్ రిపోర్టు 2019 ప్రకారం దేశంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు పొందే నైపుణ్యాలు ఉన్న యువత ఉన్న రాష్ట్రంగా ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. దీనికి ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అమలు చేస్తున్న కార్యక్రమాలే కారణమని ఆ నివేదిక వెల్లడించింది. దీంతో వివిధ రాష్ట్రాలు ఏపీలో అమలు చేస్తు న్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు వస్తున్నాయి. ఇటీవలే గుజరాత్ అధికారుల బృందం వచ్చి అధ్యయనం చేసి వెళ్లింది.
తాజాగా ఒడిశా స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారుల బృందం రెండు రోజుల పర్యటనకు విజయవాడకు వచ్చింది. ఈ బృందానికి ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ కృతిక శుక్లా పవర్ పా యింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం గుంటూరు జిల్లా నంబూరులోని గూగుల్‌కోడ్ ల్యాబ్, సీమెన్స్ ఎక్సలెన్స్ కేంద్రం, నాగార్జున వర్సిటీలో డస్సాల్ట్ మదర్ హబ్ త్రీడీ ఎక్స్‌పీరియన్స్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి విద్యార్థులను శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఏపీలో ఏర్పాటు చేస్తున్న వివిధ కంపెనీలతో కలసి పని చేయడాన్ని వివరించారు. వివిధ రంగాలకు అవసరమైన విధంగా యువతకు శిక్షణ ఇస్తున్న తీరు, విశాఖలో స్కిల్ డెవలప్‌మెంట్ వర్సిటీ ఏర్పాటు ప్రతిపాదన గురించి బృందానికి తెలిపారు.
ముఖ్యమంత్రి యువనేస్తం కింద భృతి పొందుతున్న వారికి 522 కేంద్రాల ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల, కళాశాలల విద్యార్థులకు అకడమిక్ పాఠ్యాంశాలతో పాటు నైపుణ్య శిక్షణ ఇవ్వడాన్ని ఒడిశా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారుల బృందం కొనియాడింది. విద్యార్థులు కళాశాలల నుంచి వచ్చేసరికే పూర్తి నైపుణ్యతతో ఉండేందుకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంది. ఉద్యోగావకాశాలు పొందే నైపుణ్యాలు కలిగిన యువత అధికంగా ఉన్న రాష్ట్రంగా ఏపీ జాతీయస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన నేపథ్యంలో ఇక్కడి విధానాలను తెలుసుకునేందుకు ఒడిశా అధికారుల బృందం వచ్చింది. ఒడిశాలో ప్రధానంగా ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంపైనే దృష్టిసారించినట్లు తెలిపారు.