జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని, రాజ్యాంగ పరంగా తనకు సంక్రమించిన హక్కుని ప్రతిపక్షంపై, ప్రజలపై రాజకీయ కక్షసాధింపులకు ఉపయోగిస్తున్నారని, వేధింపులే లక్ష్యంగా జగన్ ముందుకెళుతున్నాడని టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 14ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి, సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడికి భద్రత తగ్గించడం కూడా జగన్ కక్షసాధింపుల్లో భాగమేనని రామయ్య తెలిపారు. అలిపిరి ఘటనలో 26 క్లైమోర్ మైన్స్ పెట్టి చంద్రబాబుపై దాడికి పాల్పడ్డారని, ఆనాటి నుంచి కేంద్ర్ర ప్రభుత్వం ఆయనకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ భద్రతను కూడా కొనసాగిస్తోందన్నారు. జగన్ ముఖ్యమంత్రయ్యాక, చంద్రబాబు భద్రతను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారని, అతి కీలకమైన అంశాన్ని కూడా తన రాజకీయ అవసరాలకు వాడుకోవాలని జగన్ చూస్తున్నాడని వర్ల ఆక్షేపించారు. 146మంది సిబ్బందితో కొనసాగుతున్న చంద్రబాబు భద్రతను 67 మందికి తగ్గించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం చూస్తుంటే, సీఎం ఆలోచనల వెనుక కుట్రకోణం దాగి ఉందన్న అనుమానం కలుగుతోందన్నారు.
చంద్రబాబుకి భద్రత తగ్గించడం ద్వారా ఆయన్ని ఏమీ చేయాలని చూస్తున్నారో జగన్ చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. సీఎం వ్యవహారశైలి ఎంతమాత్రం సరియైనది కాదని, చంద్రబాబు భద్రత విషయంలో జగన్ తన రాజకీయ క్రీనీడను చొప్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ కు ఉన్న జడ్ కేటగిరి భద్రతను కూడా తగ్గించి, వై స్థాయికి తీసుకురావడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వ రాజకీయ విధానమేంటో, చంద్రబాబుకి, లోకేశ్ కు భద్రతను తగ్గించడం ద్వారా ఏ విధమైన ఆలోచనలు చేస్తోందో చెప్పాలని రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు రాజకీయ ప్రత్యర్థులు, ఎర్రచందనం స్మగ్లర్లు, కొన్ని అసాంఘిక శక్తుల నుంచి చంద్రబాబునాయుడికి ప్రమాదం పొంచి ఉన్న తరుణంలో, ఇటువంటి నిర్ణయం ఎంతమాత్రం సమంజసం కాదని వర్ల స్పష్టంచేశారు. భద్రత తగ్గింపు చర్యల ద్వారా ముఖ్యమంత్రి జగన్ తన మనసులో ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో చెప్పాలని, ఇంటిలిజెన్స్ వ్యవస్థకు ఎలాంటి ఆదేశాలు ఇస్తున్నారో బహిర్గతం చేయాలని టీడీపీనేత డిమాండ్ చేశారు. విశాఖలో ఎన్నికలకు ముందు ఒక ఎమ్మెల్యేను నక్సలైట్లు కాల్చిచంపిన ఘటనను ప్రజలెవరూ మరిచిపోలేదన్నారు. ప్రస్తుతం తీసుకున్న చర్యల ద్వారా జగన్ ఆలోచనా విధానం ఏస్థాయిలో ఉందో జనం కూడా ఆలోచించాలని వర్ల తెలిపారు.
వ్యవస్థలపై, సిద్ధాంతాలపై నమ్మకం లేకుండా, కోర్టులంటే భయంలేకుండా ప్రవర్తిస్తున్న జగన్మోహన్ రెడ్డి, రాచరికపోకడలతో, నియంతృత్వ విధానాలు అవలంభిస్తున్నాడని రామయ్య దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య పరిపాలనలో రాజ్యాంగ బద్ధంగానే పాలించాలనే విషయాన్ని జగన్ గుర్తించాలని, ప్రతి చర్య, ప్రతివిధానం కూడా న్యాయబద్ధంగానే జరగాలని స్పష్టంచేశారు. చంద్రబాబుకి, లోకేశ్ కు భద్రత తగ్గించడమనేది జగన్ తీసుకున్న నిర్ణయమేనని, ఆయనతో పాటు, ఆయనపార్టీకి కూడా ఇందులో ప్రమేయముందని వర్ల తేల్చిచెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఒకవైపు టీడీపీనేతలను బెదిరిస్తూ, మీసాలు తిప్పుతుంటే, మరోవైపు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష సభ్యుల భద్రతను తగ్గిస్తూండటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. చంద్రబాబు, లోకేశ్ ల భద్రతను వెంటనే పునరుద్ధరించాలని, అలా చేయకుంటే జరిగే సంఘటనలకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాల్సి ఉంటుందని వర్ల స్పష్టంచేశారు. ప్రతిపక్ష నేత భద్రతతోనే ప్రభుత్వం ఎందుకు ఆటలాడుతోందని, అతికీలకమైన వ్యక్తి భద్రత అంశంలో ఇటువంటి చర్యలు సరికాదని వర్ల తెలిపారు. సెక్యూరిటీ అంశంపై తామేమీ ఆందోళన చెందడంలేదని, ప్రభుత్వ చర్యలు చూస్తుంటే తమకు పలు అనుమానాలు కలుగుతున్నాయని, జగన్ చర్యల వెనుక ఏదో దురుద్దేశం ఉందనిపిస్తోందని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా వర్ల అభిప్రాయపడ్డారు.