"సచివాలయంలోని ఒక విభాగాన్ని కర్నూలుకు తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఈనెల 26వ తేదీ వరకు ఆగమని చెప్పాము కదా. అంత తొందర ఏమొచ్చింది? దీనిపై ఇప్పుడే ఉత్తర్వులు ఇస్తాము " అని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ పై హైకోర్ట్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. " సచివాలయంలో సరిపడినంతగా జాగా లేనందువల్లనే, పాలనా సౌలభ్యం కోసం కొన్ని విభాగాలను మార్చవలసి వచ్చిందని అడ్వ కేట్ జనరల్ చెప్పారు. సచివాలయంలో జాగా లేకపోతే, పక్కనే ఇంకొకటి నిర్మించుకోండి, అంతేగాని వేరే చోటుకి ఎలా మారుస్తారు ? అని ధర్మాసనం ప్రశ్నించింది. కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీ, విజిలెన్స విభాగాలను కర్నూలు తరలిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై తాళ్లాయపాలెంకు చెందిన కొండేపాటి గిరిధర్ అనే రైతు హైకోర్ట్ లో ప్ర జప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇదే తరహాలో మరో రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, జస్టిస్ జయసూర్యలతో కూడిన ధర్మాసనం నిన్న లంచ్ మోషన్లో వాటిని విచారణకు స్వీకరించింది.
తొలుత గిరిధర్ తరపు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు మాట్లాడుతూ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డియే రద్దు బిల్లులు చట్టం కానందున ప్రభుత్వం కుట్రపూరితంగా ఆయా బిల్లులలోని అంశాలపై ఈ విధంగా దొడ్డిదారిన జీవో జారీ చేస్తున్నదని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దానిపై అడ్వకేట్ జనరల్ శ్రీరాం మాట్లాడుతూ చట్టం కాకుండా బిల్లులోని అంశాలపై ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకోదని, ఈ తరలింపు కేవలం జాగా సరిపోనందునే చేయాల్సి వచ్చిందని, దీనిలో రాజకీయపరమైన అజెండా ఏమి లేదని ధర్మాసనానికి వివరించారు. ఒక దశలో న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్దం అయ్యారు. అడ్వకేట్ జనరల్ పలుమార్లు జోక్యం చేసుకొని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఇదే అంశంపై దాఖలైన ' పిల్ ' తరపు న్యాయవాదులు సైతం వారి వాదనలు వినిపించాయి. ఈ స్థితిలో కొంత సందిగ్ధత తలెత్తింది. ప్రభుత్వం తరపున కొన్ని ఉత్వర్వులను అందజేయాల్సి ఉన్నందున కేసును వాయిదా వేయాల్సిందిగా అడ్వకేట్ జనరల్ కోరారు. దీంతో హైకోర్ట్ ధర్మాసనం కేసును ఈ రోజుకి వాయిదా వేసింది. ఈ రోజు ఈ కేసు పై వాదనలు ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా, పిటీషనర్ తమ వాదనలకు సంబధించి, డాక్యుమెంట్లు ఇవ్వాలని, హైకోర్ట్ ఆదేశించింది. డాక్యుమెంట్లు లేకుండా, ఓరల్ ఆర్గుమెంట్ చెయ్యటం సబబు కాదని కోర్ట్ చెప్పింది. అలాగే, ఏ కారణాల చేత, ఆఫీసులు కర్నూల్ తరలిస్తున్నారో, అఫిడవిట్ రూపంలో చెప్పాలని, ప్రభుత్వాన్ని, హైకోర్ట్ ఆదేశించింది. దీని పై ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్ట్, విచారణకు మంగళవారానికి వాయిదా వేసింది.