మూడు రాజధానుల విషయం పై, రేపు అధికారిక ప్రకటన వస్తుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. పది రోజుల క్రితం, అసెంబ్లీ వేదికగా, జగన్ మోహన్ రెడ్డి, మూడు రాజధానులు ఉండొచ్చు అంటూ, వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే, నాలుగు రోజుల క్రితం, జీఎన్ రావు కమిటీ కూడా జగన్ కు నివేదిక ఇచ్చి, వాళ్ళు కూడా మీడియాతో మాట్లాడుతూ, మేము కూడా మూడు రాజధానులకు సై అంటూ చెప్పుకొచ్చారు. మరో పక్క అమరావతి రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. తమ వద్ద నుంచి రాజధాని మార్చవద్దు అంటూ పది రోజులుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అయినా ప్రభుత్వం మాత్రం, ఏమి స్పందించటం లేదు. ఈ నేపధ్యంలోనే, రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అమరావతిలోని సచివాలయంలో, క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలోనే, జీఎన్ రావు కమిటీ నివేదికను ఆమోదించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అని చెప్తూ, నిర్ణయం తీసుకోనున్నారు.
విశాఖపట్నంను, పరిపాలనా రాజధానిగా చేస్తూ, నిర్ణయం తీసుకోనున్నారు. అయితే రేపు అనగా, 27న క్యాబినెట్ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకుని, 28న జగన్ మోహన్ రెడ్డి, విశాఖపట్నం వెళ్లనున్నారు. విశాఖపట్నంలో 28న జరిగే, విశాఖ ఫెస్ట్ కు, జగన్ మొహన్ రెడ్డి వస్తున్నారు. ఈ నేపధ్యంలోనే, విశాఖలో ఉన్న వైసీపీ నాయకులకు అందరికీ, విజయసాయి రెడ్డి ఒక మెసేజ్ పంపించారు. విజయసాయి రెడ్డి పేరుతొ, ఉన్న ఒక మెసేజ్, సోషల్ మీడియాలో తిరుగుతుంది. దాంట్లో, విజయసాయి రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర సీనియర్ నాయకులను ఉద్దేశిస్తూ, విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా చేస్తూ, జగన్ మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న విషయం మీకు తెలిసిందే అంటూ మొదలు పెట్టరు.
విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా చేసిన తరువాత, జగన్ మోహన్ రెడ్డి గారు, ఈ నెల 28న విశాఖ ఫెస్ట్ లో పాల్గునటానికి, మన విశాఖ వస్తున్నారు, అందుకే విశాఖ వస్తున్న ఆయనకు, పెద్ద ఎత్తున స్వాగతం పలకాలి. థాంక్స్ జగనన్నా అంటూ, మన జన నేతకు మీరు మద్దతు పలుకుతూ, ఘన స్వాగతం పలకాలి అంటూ, విజయసాయి రెడ్డి వారికి మెసేజ్ పంపించారు. అయితే ఇదంతా ఒక రాజకీయ పార్టీ విషయంలో బాగానే ఉన్నా, ఇలాంటి పెద్ద విషయం అని నిజంగా వైసీపీ అనుకునుంటే, విశాఖపట్నం ప్రజలు, జగన్ కు స్వాగతం పలకాలి, స్వచ్చందంగా రావాలి కాని, ఇలా విజయసాయి రెడ్డి, అక్కడ ఉన్న నాయకులను, అలా మీరు రండి, మీరు రండి, అంటూ అడగటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు.