రాష్ట్రంలో మూడు రాజధానుల వ్యవహారం, రాజుకుంటుంది. ఇప్పటికే జగన్ మాటలతో, అమరావతి రైతులు రోడ్డున పడితే, ఇప్పుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు, రైతులకు మరింత ఇబ్బందికరంగా మారాయి. ఒక పక్క రైతులు రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తుంటే, వారితో చర్చించాల్సింది పోయి, వారిని మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు పెద్దిరెడ్డి. మేము మూడు కాకపోతే 33 రాజధానులు పెట్టుకుంటామని అన్నారు. ఏ కేంద్రం పర్మిషన్ మాకు అవసరం లేదని అన్నారు. అలాగే అమరావతిలో రైతుల భూములను వెనక్కి ఇచ్చేస్తాం అంటూ పిడుగు లాంటి వార్త చెప్పారు. రాజధాని భూములు వెనక్కి ఇస్తామని, గతంలోనే జగన్ చెప్పారని, దానికి అనుగుణంగా, వెనక్కు ఇచ్చేస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు అమరావతిలో ఆందోళన చేసేది అంతా, తెలుగుదేశం కార్యకర్తలు మాత్రమే అని అన్నారు. టిడిపి వారే రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారని పెద్దిరెడ్డి అన్నారు.
విశాఖపట్నంలో ఇప్పటికే భూముల రేట్లు పెరిగాయని, అక్కడ మాకు భూములు ఉన్నాయని చెప్పటం సరైంది కాదని అన్నారు. చంద్రబాబే సచివాలయం తాత్కాలికం అన్నారని, అన్నారు. మేము మూడు కాకపొతే, 33 రాజధానులు పెట్టుకుంటామని అన్నారు. మూడు రాజధానుల గురించి కేంద్రానికి ఏం సంబంధం, వారి అనుమతి మాకు ఏమి అవసరం లేదని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. విజయవాడ అటు పల్లె కాదు, పట్టణం కాదు అంటూ, విజయవాడని కూడా కించపరుస్తూ మాట్లాడారు. మొత్తానికి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టటంలో, ఎవరి పాత్ర వాళ్ళు నిర్వహిస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక పక్క రైతులు ఆందోళన చేస్తుంటే, వారితో మాట్లాడాల్సింది పోయి, వారు టిడిపి కార్యకర్తలు అని చెప్పటం గమనార్హం.
అయితే ఈ రోజు పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యల పై, రాజధాని రైతులు భగ్గుమన్నారు. ఇప్పటికే జగన్ ప్రకటనతో చచ్చిపోయి ఉన్నామని, ఇప్పుడు మంత్రులు గుచ్చి గుచ్చి చంపుతున్నారని అన్నారు. సమస్యని పరిష్కరించాల్సింది పోయి, భూములు వెనక్కు ఇచ్చేస్తామని చెప్పటం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. మేము రైతులం అని, అన్ని కులాల వారు ఉన్నారని, మమ్మల్ని టిడిపి కార్యక్రర్తలు ముద్ర వేసి, సమస్యను రాజకీయం చెయ్యవద్దు అంటూ, వేడుకుంటున్నారు. అమరావతిలో ఈ రోజు ఏ పార్టీ జెండా లేదని, ఇక్కడ ఉన్నది జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్న, నల్ల జెండాలు మాత్రమే అని రైతులు వాపోతున్నారు. దయ చేసి, మమ్మల్ని రోజు రోజుకి గుచ్చి గుచ్చి చంపవద్దు అంటూ, వేడుకున్నారు.