పోలవరం ప్రాజెక్ట్ గతంలో ఒక కలగా ఉండేది. కాని గత 5 ఏళ్ళ కాలంలో, చంద్రబాబు చూపించిన చొరవతో, పనులు 72 శాతం వరకు వచ్చాయి. ప్రాజెక్ట్ కు ఒక రూపు వచ్చింది. అయితే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రివర్స్ టెండరింగ్ పేరుతొ ముందుకు రావటం, తరువాత కోర్ట్ ల్లో కేసులు వెయ్యటంతో, ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. నవంబర్ 1 నుంచి పనులు మొదలయ్యాయి అని చెప్తున్నా, ఏదో పేరుకి చేస్తున్నారు అంతే. మరో పక్క, పోలవరంలో, చంద్రబాబు వేల కోట్లు అవినీతి చేసేసారని, పోలవరం ప్రాజెక్ట్ ని చంద్రబాబు ఏటియం గా వాడుకున్నారు అంటూ, రాజకీయ విమర్శలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి గారు కూడా, ఆయన అధికారంలోకి రాగానే, ఒక నిపుణుల కమిటీ వేసి, పోలవరంలో జరిగిన అవినీతిని తవ్వి తియ్యమన్నారు. ఆ కమిటీ కూడా తమ పని ప్రారంభించింది. అయితే, ఆరు నెలలు అవుతున్నా, ఆ కమిటీ ఏమి తేల్చింది అనే విషయం ఎవరికీ తెలియదు. అయితే, విజయసాయి రెడ్డి రాజ్యసభలో వేసిన ఒక ప్రశ్నకు, ఈ కమిటీ గురించి, కేంద్రం సమాధానం చెప్పింది.
విజయసాయి రెడ్డి ప్రశ్న అడుగుతూ, పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, గత ప్రభుత్వంలో అదనపు చెల్లింపులు జరిపి, అవినీతికి పాల్పడింది అంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ నిజమేనా ? దాని పై, కేంద్రం ఏమి చర్యలు తీసుకుంది అంటూ, ప్రశ్నించారు. ఇంకేముంది, చంద్రబాబు అవినీతి చేసాడు అని, దేశమంతా తెలిసిపోతుంది అంటూ, వైసీపీ సంబరపడింది. అయితే, అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. జల శక్తి మంత్రి రతన్ లాల్ కటారియా సమాధానం చెప్తూ, అదనపు చెల్లింపులు చేసింది నిజమే కాని, ఎక్కడా రూల్స్ అతిక్రమించి, చెల్లింపులు చెయ్యలేదని, ఏపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ చెప్పిందని, దీనికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం, నవంబర్ 11న ఒక లేఖ కూడా మాకు రాసిందని చెప్పారు.
అంతే ఒక్కసారిగా వైసీపీ పార్టీ షాక్ అయ్యింది. తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీనే, ఎలాంటి అవకతవకలు జరగలేదని, అన్నీ రూల్స్ ప్రకారమే జరిగాయని, ఏకంగా లేఖ రూపంలో, కేంద్రానికి చెప్పటం, అదే విషయం, కేంద్రం రాజ్యసభలో చెప్పటం విని షాక్ అయ్యారు. విజయసాయి రెడ్డి, చంద్రబాబుని ఫిక్స్ చేద్దమనుకుంటే, మనమే ఇప్పుడు క్లీన్ చిట్ ఇచ్చి, సెల్ఫ్ గోల్ వేసుకున్నామని, అనుకుంటున్నారు. గత ప్రభుత్వంలో, మొత్తం, 2346 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించినట్లు జల శక్తి మంత్రి రతన్ లాల్ కటారియా వెల్లడిస్తూ వివరాలు చెప్తూనే, ఈ చెల్లింపులలో విధానపరమైన అతిక్రమలు లేవని, సంబంధిత అధికారుల ఆమోదం పొందిన తర్వాతే అదనపు చెల్లింపులు జరిగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం లేఖలో పేర్కొన్నట్లు మంత్రి తెలిపారు.