వైసీపీ దారుణ పరాజయం ఖాయమని అందరికంటే ముందు మంత్రి ధర్మాన ప్రసాదరావు ఏడాది క్రితమే ఫిక్స్ అయిపోయారు. తనకు మంత్రి పదవి రాలేదనే అలకబూనిన ధర్మాన అప్పట్లో శ్రీకాకుళం జిల్లాలో తన సొంత టీముతో సర్వే చేయించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 10 స్థానాలలో 8 టిడిపి గెలుస్తుందని, 2 వైసీపీ ఖాతాలో పడతాయని తేలింది. 2019 ఎన్నికల్లో వైసీపీ 8, టీడీపీ 2 సీట్లు గెలిచిన శ్రీకాకుళంలో ఫలితాలు తల్లకిందులు కానున్నాయని తేల్చిన ఈ సర్వేని పట్టుకుని సీఎం జగన్ రెడ్డి వద్దకు చేరిన ధర్మాన..ఈ స్థితిని మార్చాలంటే తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ధర్మాన చేయించిన సర్వే ఐప్యాక్ సర్వేకి దగ్గరగా వుండటంతో ధర్మాన ప్రసాదరావు అన్న క్రిష్ణదాస్ ని మంత్రివర్గం నుంచి తొలగించి తమ్ముడికి స్థానం కల్పించారు. అనంతరం మూడురాజధానుల పేరుతో విశాఖ రాజధాని ఉద్యమాన్ని ధర్మానకి అప్పగించారు. ఈ ఉద్యమమూ ఎంత ఖర్చుపెట్టినా పైకి లేవకపోవడంతో, తెలుగుదేశం మరింత బలోపేతం కావడంతో మంత్రి ధర్మాన ప్రసాదరావు సహనం కోల్పోయి వ్యాఖ్యలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో దారుణ పరాజయం తన మెడకు చుట్టుకునే అవకాశం ఉందని గ్రహించిన మంత్రి ధర్మాన ప్రసాదరావు ముందుగానే తప్పుకునేందుకు విశాఖ రాజధాని కోసం రాజీనామా చేయాలని చూశారు. దీనికి జగన్ ఒప్పుకోలేదు. ఏం చేయాలో పాలుపోని ధర్మాన రోజుకొక సంచలన ప్రకటన చేస్తున్నా ఎవరి నుంచి ఎటువంటి స్పందనా లేదు.
దీంతో బ్లాక్ మెయిలింగ్కి దిగారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో, ప్రజలు మొత్తం అమరావతి రాజధాని అంటున్నారని, అదే కనుక జరిగితే, విశాఖని ఒక చిన్న రాష్ట్రంగా ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. మెజారిటీ ఉత్తరాంధ్ర ప్రజలే విశాఖ రాజధాని వద్దని, అమరావతే కావాలని బహిరంగంగానే చెబుతుండడం మంత్రి ధర్మానకి అయోమయ స్థితిలోకి నెట్టేసింది. ఉత్తరాంధ్ర ప్రజలకు సైకిల్ పైన మోజు ఉన్నట్టు ఉందని, అటు వైపు మళ్ళీ మళ్ళితే, మీరు ఇబ్బంది పడతారు అంటూ ప్రజల్ని బెదిరించడం మొదలు పెట్టారు. మంత్రి ధర్మాన ప్రసాదరావుకి వైసీపీ ఉత్తరాంధ్రలో తుడిచి పెట్టుకుపోవడం ఖాయమని తెలిసిపోయింది. కానీ ఆయన మాట వైసీపీ అధినేత సీఎం జగన్రెడ్డి వినరు. ఆయన ఉత్తరాంధ్రలో 34 సీట్లలో 30 పోతాయని తెలిసినా, 175 మంత్రం జపిస్తున్నారు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అని కొందరు అంటుంటే, వైసీపీ నేతలు-కేడర్ జారిపోకుండా బూస్టప్ కోసమే ఈ ప్రకటన అనీ, జగన్ రెడ్డివి దింపుడు కల్లం ఆశ అని వైసీపీ సీనియర్ నేతలే తమలో తాము చర్చించుకుంటున్నారు.