నీటిపారుదలని నోటి పారుదలగా, ఇరిగేషన్ శాఖని ఇరిటేషన్ శాఖగా మార్చేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇటీవల కాలంలో చాలా తక్కువగా కనిపిస్తున్నారు. బుల్లెట్టు దిగిందా లేదా అంటూ అసెంబ్లీలో రౌడీభాషతో కలకలం రేపిన అనిల్ కి అసమ్మతి బుల్లెట్టు దిగి చాలా రోజులైనా, నెత్తికెక్కిన అధికారం వల్ల కనపడటంలేదని నెల్లూరు వైసీపీ నేతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రి కాక ముందు బాబాయ్ రూప్ కుమార్ యాదవ్‌తో కలిసే పంచాయతీలు, సెటిల్మెంట్లు, వ్యాపారాలు వెలగబెట్టారు అనిల్ కుమార్ యాదవ్. మంత్రి అయ్యాక బాబాయ్ అబ్బాయ్ మధ్య గ్యాప్ పెరిగింది. అబ్బాయ్ మంత్రి పదవి ఊడింది. జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలతోనూ చెడింది. అండగా ఉండే రెడ్డి సామాజికవర్గం వారూ అనిల్ అంటేనే అగ్గిమీద గుగ్గిలం అయిపోతున్నారు. బాబాయ్ రూప్ కుమార్ అనిల్ అసమ్మతి వర్గానికి ఇష్టుడయ్యాడు. నెల్లూరు డిప్యూటీ మేయర్ అయిన రూప్ కుమార్.. అనిల్ సీటుపైనా కన్నేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ రెడ్లు కూడా రూప్ కుమార్‌కి మద్దతుగా తెరవెనుక సహకారం అందిస్తున్నారు.
అవివాహితుడైన రూప్ కుమార్‌కి అబ్బాయ్ అనిల్ గుట్టుమట్లన్నీ తెలుసు. దీంతో బాబాయ్ ఎదురు తిరిగినా ఏం చేయలేక మౌనంగా వుంటున్నాడు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇప్పుడు రూప్ కుమార్ పవర్ సెంటర్ అయ్యారు. తన అనుచరుడైన మైనారిటీ నేత షాపు మెట్లను కార్పొరేషన్ అధికారులు కూల్చేశారు. దీని వెనుక అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాలు పనిచేశాయని రూప్ కుమార్ అనుమానించారు. అయితే 24 గంటలలోగానే ఆ షాపు ముందు మెట్లు నిర్మించిన డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ దమ్ముంటే తనను ఆపేవారు ఎవరో రావాలని సవాల్ విసిరారు. ఈ సవాల్ అబ్బాయ్ అనిల్కేనని వేరే చెప్పక్కర్లేదు.