తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు జగన్ ప్రభుత్వ నామమాత్రపు భద్రత మాత్రమే ఇస్తుంది. చంద్రబాబుకు ఉన్న ప్రధాన భద్రతా అధికారులను తొలగించారు. అంతే కాదు భద్రతా సిబ్బందిలో భారీ కోత విధించారు. నిన్నటి నుంచి చంద్రబాబు భద్రత ఎంతో తెలుసా ? కేవలం ఒక్కో షిఫ్టునకు ఇద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే. గత 20 ఏళ్ళుగా చంద్రబాబుకు ఇద్దరు ప్రధాన భద్రతాధికారులు, వారి కింద ఐదుగురు ఆర్‌ఎస్ఐలు, వారి కింద 15 మంది వరకు భద్రతా సిబ్బంది ఉండేవారు. అయితే ప్రభుత్వం తీసుకున్న అనూహ్య నిర్ణయంతో, గురువారం నుంచి వారు ఎవరూ విధులకు రాలేదు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆయన చేసే ప్రయాణాల్లో కూడా ఆయనతో పాటు ఫ్లైట్ లో ఒక భద్రతా అధికారి ఉండేవారు. నిన్న చంద్రబాబు హైదరాబాద్ వెళ్ళిన సమయంలో ఆ భద్రతా అధికారిని కూడా ప్రభుత్వం పంపలేదు. చంద్రబాబు వెంట కేవలం ఆయన వ్యక్తిగత సహాయకుడు మాత్రమే ఉన్నారు.

చంద్రబాబుకు భద్రతను కుదించటం పై, నిన్న చంద్రబాబు నివాసంలో జరిగిన టీడీపీ నేతల సమావేశంలో కూడా చర్చించారు. గత 20 ఏళ్ళుగా ఆయనకు ఒక ఏఎస్పీ, ఒక డీఎస్పీ, ముగ్గురు ఆర్‌ఐ బృందాలతో భద్రత ఉండేవారని, ఇప్పుడు కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లను ఇచ్చారని, ఇది కక్ష సాధింపు కాక, ఏమి ఉంటుందని ప్రశ్నించారు. అయితే గతంలో వైఎస్ కూడా ఇలాగే చేసి, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ చేత ఎన్ఎస్జీ భద్రత కూడా తొలగించే ప్రయత్నం చేస్తే, అప్పట్లో టీడీపీ పార్లమెంటరీ నేతగా ఉన్న ఎర్రన్నాయుడు, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు చెప్తే, అయన వెంటనే చంద్రబాబుకు అధిక భద్రత ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దీని పై చంద్రబాబు స్పందిస్తూ, వేధింపులు నాకు కొత్త కాదు, నా పై జగన్ కు కోపం ఉంది, భద్రత తగ్గిస్తే తగ్గించ నివ్వండి. నేను ప్రజల్లో తిరుగుతాను, ప్రజలే నాకు రక్షకులుగా ఉంటారు, ఆ పైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి, నా భద్రత సమస్య కాదు, రాష్ట్రంలో శాంతిభద్రతలు ఇప్పుడు సమస్యగా తయారు అయ్యాయని చంద్రబాబు అన్నారు.

నిన్న కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమావేశం అయ్యి, గోదావరి, కృష్ణా జలాలను పూర్తిస్థాయిలో వాడుకుందాం అంటూ, నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ భేటీ పై తెలంగాణాలో అందరూ సంతోషంగా ఉన్నా, ఇటు ఆంధ్రాలో మాత్రం, రాబోయే ఇబ్బందులు తలుచుకుని బాధ పడుతున్నారు. కేసీఆర్ అనుకున్నదే జరిగితే, విభజన నాటి కంటే, దీనమైన పరిస్థితిని మన రాష్ట్రం ఎదురుకోవాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో పారే నీళ్ళు, మన ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాం కాని, మధ్యలో కేసీఆర్ కు ఏమి సంబంధం ? జగన - కేసీఆర్ మధ్య స్నేహం ఉంటే, అది వాళ్ళ వ్యక్తిగతం. కాని అది అడ్డుపెట్టుకుని, మన నేల మీద పారాల్సిన నీళ్ళు, మనమే ఎదురు డబ్బులు ఖర్చు పెట్టి తెలంగాణాకు ఇవ్వటం ఏంటి ? ఈ నిర్ణయం వల్ల, మన రాష్ట్రానికి వచ్చే లాభం ఏంటి ? రేపు పోలవరం పూర్తి అయితే, మన నీళ్ళు మనకే ఉంటాయి. చంద్రబాబు ప్రతిపాదించిన, గోదావరి - పెన్నా అనుసంధానం కూడా మన భూభాగంలో ఉంటుంది. మరి ఇప్పుడు కేసీఆర్ తో కలిసి, మన రైతుల పొట్ట కొట్టాల్సిన పరిస్థితి జగన్ కు ఎందుకు వచ్చింది ?

పూర్తి స్థాయిలో ఈ ప్రతిపాదన బయటకు వచ్చిన రోజున, మనకు ఎలాంటి అన్యాయం జరుగుతుందో, సామాన్య ప్రజలు కూడా అర్ధం చేసుకుంటారు. ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో కేసీఆర్ తనకు కావాల్సినవి అన్నీ, జగన్ ను అడ్డుపెట్టుకుని చేసుకుంటున్నారు. మరి జగన, ఇప్పటి వరకు తెలంగాణా నుంచి ఏమి సాధించారు ? ఇదే ప్రశ్నలు సామాన్యుల నుంచి రాజకీయ నేతల నోటి వెంట వస్తున్నాయి. ఇదే అంశం పై విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని కూడా స్పందించారు. జగన్, కేసీఆర్ కలియిక పై, కేశినేని నాని ఫేస్‌బుక్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌, జగన్‌ భేటిని అభినందిస్తున్నానని, దీని వల్ల సమస్యలు పరిష్కారం అయితే మంచిదే అని అనంరు. అయితే ఇక్కడ ప్రశ్న జగన్‌ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారా? లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ సమస్యలు ఏమన్నా సాధిస్తున్నారా? ఇది మాత్రం అర్ధం కావటం లేదు అంటూ, కేశినేని ఫేస్‌బుక్‌ వేదికగా అనుమానం వ్యక్తం చేశారు.

జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పై, టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి లోకేశ్ ట్విట్టర్ ద్వారా లెక్కలతో సహా చూపించి కౌంటర్ ఇచ్చారు. విద్యుత్ కొనుగోళ్ళ ఒప్పందాల్లో, చంద్రబాబు అక్రమాలు చేసారని, దీని పై ఒక కమిటీ వేసి చంద్రబాబుని జైలుకు పంపించాలని జగన కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. దీని పై లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. విద్యుత్ కొనగాళ్ల ఒప్పందాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని, రాష్ట్రానికి చెడ్డపేరు తీసుకురావొద్దని కేంద్రం సూచించినా, చంద్రబాబు పై అవినీతి ముద్ర వేయాలని జగన్ చూస్తున్నారని విమర్శించారు. లోకేష్ ట్విట్టర్ లో స్పందిస్తూ.... ‘‘నిజాయితీకే సిగ్గుచేటు అన్నవిధంగా.. అక్ర‌మాస్తుల కేసులో ఏ1 అవినీతిపై క‌మిటీ వేశారు. ఏ2 విజయ్ సాయిరెడ్డి విచార‌ణ చేస్తార‌ట‌! క‌లికాలం కాక‌పోతే అక్ర‌మాల విక్ర‌మార్కులు నీతి నిజాయితీ గురించి మాట్లాడటమా!! వైఎస్ హ‌యాంలో సోలార్ విద్యుత్‌ యూనిట్ రూ.14కి కొంటే, టీడీపీ హ‌యాంలో రూ. 2.70 యూనిట్ కొన్నారు. మీ తండ్రి నిర్వాకంతో డిస్కంల‌కు రూ. 8 వేల‌కోట్లు న‌ష్టం వ‌చ్చింది. ఈ ఉదాహరణలు చాలవా, ఎవ‌రు మ‌హామేతో! ఎవ‌రు దార్శ‌నిక నేతో తెలుసుకోడానికి. "

"అన్న‌య్య‌లూ.. నాకేం తెలియ‌దంటూనే ఎలాంటి విచారణ జరగకుండా, కనీస ఆధారాలు లేకుండా రూ. 2,636 కోట్లు అవినీతి జ‌రిగింద‌ని తేల్చారు. గుడ్డ కాల్చి వెయ్యడంలో మీకు మీరే సాటి జగన్. తెలుగుదేశం అధికారంలోకి వచ్చేనాటికి 22 మిలియన్ యూనిట్ల లోటు విద్యుత్తు నుంచి మిగులు విద్యుత్తు సాధించి 5 ఏళ్లలో 150కి పైగా అవార్డులు సాధించడం మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. విద్యుత్ ఉత్పత్తిలో ఏపీని దేశానికే ఆదర్శంగా నిలిపాం. గడిచిన 5 ఏళ్లలో రూ.36 వేల కోట్ల పెట్టుబడి,13 వేల మందికి పైగా ఉద్యోగాలు లభించాయి. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు అంటూ పెట్టుబడులు అడ్డుకొని రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకురావొద్దని స్వయంగా కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి ఆనంద్ కుమార్ మీకు లేఖ రాసిన విషయం మర్చిపోయారా? నీతి, నిజాయితీ పునాదిగా ఎదిగిన మా అధినేత చంద్రబాబుపై అవినీతి ముద్ర వెయ్యాలనుకుంటున్న మీ ప్రయత్నం విఫలయత్నంగానే మిగిలిపోతుంది.’’ అంటూ జగన్ చేసిన్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు.

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతంలోనే ఉండాలని, ఆయన వేరే చోటుకు వెళ్ళ వద్దని, ఆయన ఇక్కడ ఉంటేనే తమకు ఎంతో ధైర్యమని రాజధాని రైతులు అన్నారు. ఈ రోజు ప్రభుత్వం చంద్రబాబు పై చేస్తున్న కక్ష పూరిత విదానలకు వ్యతిరేకంగా, చంద్రబాబుకు మద్దతు తెలపటానికి, ఉండవల్లిలోని ఆయన ఇంటి దగ్గరకు, రాజధాని ప్రాంత రైతులు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, చంద్రబాబు రాజధాని ప్రాంతంలోనే ఉండాలి కోరారు. కొత్త ప్రభుత్వం అమరావతి పై చేస్తున్న కక్ష పూరిత వైఖరితో, తమ భవిష్యత్తు గందరగోళంలో పడిందని, ఇక్కడ గత ప్రభుత్వం చేస్తున్న నిర్మాణాలన్నీ ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వం తరుపున, కౌలు రైతులకు ఇచ్చే చెక్కులు కూడా జగన్ ప్రభుత్వం ఇవ్వటం లేదని బాధ పడ్డారు. అలాగే చంద్రబాబు పై జగన్ ప్రభుత్వం చేస్తున్న కక్ష పూరిత వైఖరిని తప్పు పట్టారు.

చంద్రబాబుని ఇక్కడ నుంచి గెంటేయాలని చూస్తున్నారని, చంద్రబాబు ఉండేందుకు తమ ఇళ్ళు ఇస్తామే తప్ప ఇక్కడ నుంచి వెళ్ళనివ్వమని రైతులు స్పష్టం చేశారు. అమరావతిలోనే చంద్రబాబు ఇల్లు కట్టుకోవటానికి స్థలాన్ని ఇచ్చేందుకు తాము రెడీగా ఉన్నామని రైతులు తెలిపారు. ప్రజావేదికను అలా కూల్చేస్తారా అని వారు తప్పుపట్టారు. చంద్రబాబు ఉంటున్న ఇల్లు అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కట్టినవేనని అన్నారు. జగన్ కు నిజంగా దమ్ము ఉంటే, కరకట్టపై ఉన్న ఆస్పత్రి గోకరాజు గంగరాజుదని, ఆయన బీజేపీ నేత అని, ఆయనవి పడగొట్టాలని ఛాలెంజ్ చేసారు. ఆయన బీజేపీ నేత కాబట్టే,జగన్ ఆ ఆస్పత్రి జోలుకెళ్లలేదని రైతులు విమర్శించారు. ముందు అవి కూల్చకుండా ప్రజావేదికను ఎందుకు కూల్చారని అడిగారు. అమరావతిలో అవినీతి అవినీతి అంటూ, ఈ ప్రాంతాన్ని నష్ట పరుస్తున్నారని, అవినీతి జరిగితే చర్యలు తీసుకోండి, అమరావతి బ్రాండ్ ఇమేజ్ చెడగొట్ట వద్దు అని వేడుకున్నారు. చంద్రబాబు ఎక్కడకు వెళ్ళాల్సిన పని లేదని, ఇక్కడే ఉండాలని మనోధైర్యం చెప్పేందుకే మేమంతా ఇక్కడకు వచ్చామని రైతులు చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read