ఒంగోలు మాజీ ఎంపీ వై.వి. సుబ్బారెడ్డికి మంచి పదవితో సముచిత స్థానం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఆయనకు ఒంగోలు ఎంపీ సీటు ఇవ్వలేకపోయిన ముఖ్యమంత్రి జగన్ తొలి దశలోనే సగౌరవమైన పదవినిచ్చి రాష్ట్రస్థాయి పార్టీ వ్యవహారాల్లో వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. వివిధ కారణాలతో టీటీడీ పాలక మండలిని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డి చైర్మన్ రేసులో ముందున్నారు. దివంగత వై.ఎస్. రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ, వైవీ సుబ్బారెడ్డి సతీమణి సొంత అక్కా చెల్లెళ్లు. వైవీ సోదరిని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వివాహం చేసుకున్నారు. దీంతో వీరంతా దివంగత రాజశేఖర రెడ్డి కుటుంబానికి సమీప బంధువులుగా రాజకీయాల్లోనూ సన్నిహితులుగా కొనసాగారు.
అయితే రాజశేఖరరెడ్డి ఉన్నంతకాలం రాజకీయంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రాధాన్యం ఇస్తూ, రాష్ట్ర స్థాయిలో పార్టీ, ఇతర కుటుంబపరమైన వ్యవహారాల్లో వైవీ సుబ్బారెడ్డికి తగు స్థానాన్ని కల్పించారు.రాజశేఖరరెడ్డి మృతి తర్వాత జగన్ వైసీపీ ఏర్పాటు చేయడంతో వైవీ సుబ్బారెడ్డి పాత్ర కూడా పెరిగింది.దీంతో గత ఎన్నికల్లో వైవీ సుబ్బారెడ్డికి ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాన్ని జగన్ కల్పించారు. ఆయన గెలుపొందటమే కాక పార్లమెంటు సభ్యుడిగా చురుకైన పాత్ర పోషించారు.ఈ పర్యాయం ఎన్నికల్లో వివిధ కారణాలతో ఆయన్ని తప్పించి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు లోక్‌సభ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. ఈ విషయంలో వైవీ కినుక వహించటం, కుటుంబ సభ్యులు మధన పడటం, అయినా వైవీ జిల్లాకు వచ్చి పనిచేయకపోయినా రాష్ట్రస్థాయిలో జగన్ కార్యాలయ వ్యవహారాలు చూస్తూ కీలకంగా ఉండటం తెలిసిందే.
మరో సమాచారం మేరకు బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మధ్య పెరిగిన అగాధాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యవహారాల్లో బాలినేనికి ప్రాధాన్యం ఇస్తూ, వైవీ సుబ్బారెడ్డిని రాష్ట్ర పార్టీ వ్యవహారాలకు పరిమితం చేయాలనే ఉద్దేశంతో కూడా జగన్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడన్న ప్రచారం కూడా ఉంది. ఏదిఏమైనా మాగుంటను తీసుకోవటం ఆ పార్టీకి ఎంతో కొంత కలిసివచ్చింది. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా జగన్ బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. తదనుగుణంగా బాలినేని మంత్రి కావటం ఖాయమని తేలిపోయింది. దీంతో వైవీ సుబ్బారెడ్డిని ఎలా సంతృప్తి పరచాలన్న అంశంతో ఆయనకు టిటిడి చైర్మెన్ పదవి ఇవ్వనున్నారు.