ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రవాహ సామర్థ్యం 36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెంచితే భద్రాచలానికి ముంపు ముప్పు పొంచి ఉంటుందని నీటిపారుదల శాఖ అంతర్‌రాష్ట్ర వ్యవహారాల సీఈ నరసింహారావు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణలో ముంపునకు గురయ్యే ప్రాంతాల పరిస్థితిని ఆదివారం ప్రత్యేక అధికారుల అధ్యయన బృందం పరిశీలించింది. సీఈ నరసింహారావు, ఈఈ రాంప్రసాద్, ఐఐటీ ప్రొఫెసర్ డా.శశిధర్ నేతృత్వంలో అధికారులు భద్రాచలంలో పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా సీఈ నరసింహారావు విలేకరులతో మాట్లాడారు. జాతీయ హోదా పొందిన పోలవరం ప్రాజెక్టును ముందుగా అనుకున్న 36 లక్షల క్యూసెక్కులకు మించి 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నిర్మిస్తున్నందున భద్రాచలం తీరప్రాంతంలో ముంపు ప్రభావం ఎలా ఉంటుందనేది అంచనా వేశామని తెలిపారు.
36 లక్షల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యానికే భద్రాచలం వద్ద సాధారణ రోజుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి అయిన 43 అడుగుల మేర నీటిమట్టం ఉంటుందని స్పష్టం చేశారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో పోలవరం నిర్మిస్తే ఆ ప్రాజెక్టు నుంచి 120 కి.మీ. మేర వెనుక జలాలు ఉంటాయని వివరించారు. ఈ 120 కి.మీ.లలో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటాయని తెలిపారు. తెలంగాణలో సుమారు 30 కి.మీ విస్తీర్ణంలో ఉంటాయన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల వరకు వరద పోటెత్తే ప్రమాదం ఉందనే అంచనాకు వచ్చామని వివరించారు. పినపాక నియోజకవర్గంలోని భారజల కర్మాగారం, ఐటీసీ కాగిత పరిశ్రమ, సీతారామ ప్రాజెక్టుకు ఈ వరద ప్రభావం ఉంటుందా? లేదా? అనేది అంచనా వేస్తున్నామని చెప్పారు.
సమగ్ర సమాచారాన్ని సేకరించి సుప్రీంకోర్టుకు వివరాలను అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ముంపు ప్రాంతాలకు పరిహారం అందిస్తున్నందున కొత్తగా చేరే ప్రాంతాలకు కూడా న్యాయం చేయాలన్న ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. ముంపు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల నుంచి తూర్పు గోదావరి జిల్లాలో విలీనమైన నెల్లిపాక వరకు కరకట్టను నిర్మించాలన్న ఆలోచనలు కూడా అధికారులు చేస్తున్నారు. అయితే తెలంగాణా అభ్యంతరాల పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. భద్రాచలానికి ఎలాంటి ముప్పు ఉండదని చెప్తూ, అంత అభ్యంతరం ఉంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్టు, భద్రాచలం మాకు ఇచ్చేయండి, ఎలాగూ అది మా భూభాగం నుంచే మీరు తీసుకున్నారు కదా, మేమే ఏ ముప్పు రాకుండా చూసుకుంటామని అన్నారు.