కింగ్ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ జయసూర్య(బ్రహ్మానందం) పుట్టిన రోజుని బొట్టు శ్రీను (నాగార్జున) ఎలా సెలబ్రేట్ చేస్తానంటాడో గుర్తుందా? బ్రహ్మి పుట్టినరోజుకి బ్రహ్మితోనే రక్తదానం చేయిస్తాననడం ఈ మూవీలో హైలైట్ కామెడీ సీన్. ఇప్పుడు ఏపీలో ఇంచుమించు ఇలాంటి సన్నివేశాలే జగన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలోనూ బయటపడుతున్నాయి. సీఎం జగన్‌ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయాలంటూ కాకినాడ జిల్లాలో కీలక శాఖల ఉద్యోగులపై ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు పెరిగిపోయాయి. రక్తదానం చేయాల్సిందేనంటూ బలవంతం చేస్తున్నారు. దీంతో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు జగన్ పుట్టిన రోజైతే జనం రక్తం ఎందుకు జలగల్లా పీల్చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. మీకు అంత సరదాగా వుంటే మీరివ్వండంటూ ఉన్నతాదికారులపై తిరగబడుతున్నారు.   ఒక్కో మండలం నుంచి కనీసం 200 యూనిట్ల బ్లడ్ ప్రభుత్వ ఉద్యొగులు దానం చేయాలని టార్గెట్ విధించారు. మండలంలో ఏ శాఖలో ఎ ఊరులో పనిచేస్తున్న వారైనా మండల కేంద్రానికి వచ్చి రక్తం ఇచ్చి వెళ్లాల్సిందేనని తాఖీదులు పంపారు. తమ పరిధిలోని డ్వామా, సచివాలయ, పంచాయతీ తదితర శాఖల ఉద్యోగులు ఉదయాన్నే వచ్చి రక్తం దానం చేయాలని మౌఖిక ఆదేశాలిచ్చారు. ఉద్యోగుల రక్తం పీల్చే బాధ్యతలను ఎంపీడీవోలు చూశారు. మరోవైపు కళాశాలల్లో విద్యార్థుల నుంచి బలవంతంగా రక్తదానం చేయించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏపీలో అమలు చేస్తున్న పథకాలు ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని వైఎస్సార్సీపీ సోషల్మీడియాలో ప్రచారం చేసుకుంటారు. కానీ ఇప్పటివరకూ ఏ ఒక్క రాష్ట్రమూ ఏపీలో వైసీపీ సంక్షేమ పథకాలు అమలు చేసిన దాఖలాలు లేవు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తమకు ఇస్తున్న లోపాయికారీ మద్దతుని అలుసుగా తీసుకుని వైసీపీ సర్కారు తమకు తోచిన రీతిలో ప్రచారం చేసుకుంటూ ఉంది. ఇందులో ఒకటి ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలుచేసేందుకు కేంద్రం పరిశీలిస్తుందనేది ఒకటి. ఇదే వ్యవస్థని నీతిఆయోగ్ ప్రశంసించిందని మరో వైసీపీ ప్రచారమూ డొల్లేనని తేలిపోయింది. ఇది ఎవరో పని కట్టుకుని బయటపెట్టిన అంశం కాదు. వైసీపీకి చెందిన లోక్ సభ సభ్యులు వల్లభనేని బాలశౌరి, లావు శ్రీక్రిష్ణదేవరాయలు అడిగి మరీ కేంద్రంతో చెప్పించుకున్న సమాధానాలు. ఏపీ అమలు చేస్తున్న వార్డు, గ్రామ సచివాలయాల వ్యవస్థని నీతిఆయోగ్ ఎప్పుడూ ప్రశంసించలేదని, ఈ వ్యవస్థని దేశవ్యాప్తంగా అమలు చేసే ప్రతిపాదన కాదు, ఆలోచన కూడా కేంద్రానికి లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి సమాధానం ఇచ్చారు.

అప్పట్లో టిడిపి మాజీ మంత్రి పరిటాల రవిని అత్యంత దారుణంగా హత్య చేసినట్టే, మాచర్లలో టిడిపి నేత జూలకంటి బ్రహ్మారెడ్డిని అంతమొందించాలని చూశారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. బ్రహ్మారెడ్డిని చంపించేందుకు పోలీసులే స్కెచ్ వేశారని ఆందోళన వ్యక్తం చేశారు. పల్నాడులో వరసగా జరుగుతున్న ఘటనలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని స్పష్టం అయ్యిందన్నారు. ప్రజల మద్దతు కోల్పోయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు తెరలేపారని పేర్కొన్నారు. ఆరిపోయే దీపం లాంటిది వైకాపా ప్రభుత్వం అనేది మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి గుర్తుంచుకోవాలని టిడిపి నేత యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. టిడిపికి చెందిన ఎస్సీ, ఎస్టీ,బీసీ నాయకుల్ని పోలీసులతో పిన్నెలి కొట్టిస్తున్నాడని, తెలుగుదేశం నేతల్ని హింసించే పోలీసులెవ్వరికీ భవిష్యత్తులో ఉద్యోగాలుండవని హెచ్చరించారు. బరితెగించిన మాచర్ల పోలీసుల్ని డీజీపీ అదుపులో పెట్టకపోతే వారి పరిస్థితి ఇక ఆగమ్యగోచరమేనన్నారు. పోలీసుల నిర్బంధాలకు, వైసీపీ దాడులకు తెదేపా నేతలెవ్వరూ భయపడట్లేదని తేల్చి చెప్పారు. నిర్బంధాలు ఉన్నచోటే తిరుగుబాటు ఉంటుందని గుర్తించాలని హితవు పలికారు. మాచర్ల పోలీసులు అమాయకులపైన ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి వెల్దుర్తి, సాగర్ పోలీస్ స్టేషన్లలో పెట్టి హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ ని కలిసిన టిడిపి నేతలు మాచర్ల లో జరిగిన ఘటన కు సంబంధించి వీడియో ఫుటేజ్,వైసీపీ నేతలు దాడికి ముందు మారణయుధాలు పట్టుకుని తిరిగిన ఫొటోలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా చీరలు పంపిణీ చేసిన డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్, ఖలీల్ అహ్మద్లు. అక్కడ చీరలు పంపిణీ చేసే సమయంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తోపులాటలో చాలా మంది మహిళలు కింద పడిపోయారు. దాంతో చాలా మంది మహిళలు గాయాలపాలయ్యారు. మరోవైపు అదే సభలో డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్, ఖలీల్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ఇద్దరు డిప్యూటీ మేయర్లు ట్రంకురోడ్డులో ఒకేసారి బైకు ర్యాలీ చేయడంతో, ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. దీనితో అక్కడ జనం ఆయన పుట్టినరోజు అయితే ఇక్కడ వీళ్ళు ర్యాలీలు చేసి జనాలను ఇలా ఇబ్బంది పెట్టటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read