కృష్ణా జిల్లా పెనమలూరు తెదేపా అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కంకిపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా అస్వస్థతకు గురైన ఆయనను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎండల్లో ప్రచారం చేయడం వల్ల ఆయన డీహైడ్రేషన్‌కు గురైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్యేకి ఏంజరిగిందో అర్థంకాక అనుచరులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆయనను తాడిగడపలోని ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు చికిత్స అందించారు. ఎమ్మెల్యే వడదెబ్బకు గురయ్యారని వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో చేరిన సమయంలో బోడె ప్రసాద్ శ్వాస సంబంధ ఇబ్బందులకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్టు తెలుస్తోంది.

bode 31032019

అంతకు ముందు ఎన్నికల ప్రచారంలో బోడె మాట్లాడుతూ, 2014 ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చానని అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకు మరోసారి టికెట్ రావడంతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించానని చెప్పారు. గత ఎన్నికల కంటే ఈసారి విశేష స్పందన కనిపిస్తోందని... ఏపీలో టీడీపీ ఏకపక్షంగా విజయం సాధించే అవకాశం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలే టీడీపీకి విజయాన్ని కట్టబెడతాయని చెప్పారు. తన నియోజకవర్గ పరిధిలో ఉన్న 42 గ్రామాల్లో 90 శాతం అభివృద్ధి చేశానని తెలిపారు. నియోజకవర్గంలో అందరినీ కలుపుకుని పోతానని, చిన్నచిన్న లోపాలు ఉంటే సరిదిద్దుకుని ముందుకు సాగుతానని చెప్పారు.

bode 31032019

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. 1,85, 560 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననుండగా, 94, 991 ఈవీఎంలను ఉపయోగించనున్నారు. 41,356 వీవీపాట్ యంత్రాలను సిద్ధం చేశారు. ఎన్నికల కోసం ఏకంగా 270 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించనున్నారు. దాదాపు 2.95 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటు హక్కు లేని వారు నమోదు చేసుకునే అవకాశం ఇక లేదు. తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలతో పాటు ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్‌ 11న తొలి విడతలో ఒకే దఫాలో పోలింగ్‌ జరగనుంది. ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరగనుండగా.. మే 23న ఫలితాలు వెల్లడవుతాయి.

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతకు భృతి అందజేస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.1,000 అందజేస్తుండగా దానిని రూ.2,000 పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి గత జనవరిలో ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే, దీనికి ప్రస్తుతం ఎన్నికల కమిషన్ మోకాలడ్డింది. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద నిరుద్యోగులకు అందజేస్తోన్నభృతిని రూ.1,000 నుంచి రూ.2 వేలకు పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. ఎన్నికల పూర్తయ్యేంత వరకూ ఎలాంటి పెంపు ఉండరాదని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి యువనేస్తంతో సహా పలు ఉద్యోగ నియామకాలు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా లాంటి పథకాలకు సంబంధించి ఈసీ అనుమతి కోసం ప్రభుత్వం ఓ లేఖ రాసింది.

ec 31032019

దీనిపై ఇటీవల ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కోరగా, ఆ ప్రతిపాదనలను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించింది. వీటిని పరిశీలించిన ఈసీ, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున పెంపునకు నిరాకరిస్తున్నట్లు తెలిపింది. అయితే, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌లు, రాష్ట్ర సమాచార కమిషనర్‌ నియామకం, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా లాంటి ప్రతిపాదనలకు మాత్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి శుక్రవారం రాత్రి లేఖ అందింది. దీంతో ఏప్రిల్ 1 నుంచి నిరుద్యోగ భృతి పెంపునకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి.

ec 31032019

ఇక మరో పక్క, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం పసుపు కుంకుమ. ప్రతి డ్వాక్రా మహిళకు రూ.10వేలు అందించాలన్నది ఈ పథకం లక్ష్యం. ఈ సొమ్మును మూడు విడతల్లో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే ఫిబ్రవరి, మార్చి నెలల్లో రెండు విడతలుగా నగదు పంపిణీ జరిగింది. మూడో విడత చెక్కులు ఏప్రిల్‌ ఐదో తేదీనుంచి చెల్లుబాటులోకి వస్తాయి. 11న పోలింగ్‌ నేపథ్యంలో పసుపు-కుంకుమ నిధులు పొదుపు మహిళల బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా లేవు. 5న జగ్జీవన్‌రామ్‌ జయంతి, 6న ఉగాది, 7న ఆదివారం కావడంతో వరుసగా మూడ్రోజులపాటు బ్యాంకులకు సెలవు. అంటే 8వ తేదీ నుంచి చెక్కులను మార్చుకోవచ్చన్నమాట.

గుడివాడలో వైసీపీకి ఎదురేలేదని ఆ పార్టీ నేతలు ఇప్పటివరకు ప్రగల్బాలు పలుకుతూ వచ్చారు. దేవినేని అవినాష్‌ను అభ్యర్థిగా ప్రకటించగానే కొడాలి నాని మెజార్టీ ఈసారి 20 వేలకు పెరుగుతుందని, ఉఫ్‌ అని ఊదేస్తామని బీరాలు పోయారు. కానీ అవినాష్‌ వచ్చిన దగ్గర్నుంచి గుడివాడ టీడీపీలో పరిణామాలు చకచకా మారిపోయాయి. అందరి అంచనాలు తారుమారయ్యాయి. వచ్చిన పదిరోజుల్లోనే అవినాష్‌ దూసుకుపోతున్నారు. చంద్రబాబు వార్నింగ్‌, సూచనలతో టీడీపీ యంత్రాంగం మొత్తం దాదాపుగా ఏకతాటిపైకి వచ్చింది. నానికి వ్యూహాల్లో గానీ, ఎత్తుగడల్లో కానీ ఎందులోనూ వీసమంత కూడా తగ్గేది లేదన్న అభిప్రాయాన్ని అవినాష్‌ అండ్‌కో పార్టీ కేడర్‌లో కలిగించింది.

gudivada 3102019

రోజురోజుకు అవినాష్‌కు పెరుగుతున్న ఆదరణ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. టీడీపీ స్పీడ్‌ వైసీపీని ఆత్మరక్షణలో పడేసింది. ఆ పార్టీ చేస్తున్న ప్రచారానికి కనీస స్పందన కూడా కనిపించడం లేదు. వైసీపీ ముఖ్య నేత వెంట తిరిగే నాయకులే ఈ ఎన్నికల్లో తమ పని ఖాళీ అనే అభిప్రాయానికి వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు పది రోజుల ముందే నాని వర్గం డీలా పడటం చూసి పరిశీలకులు ఆశ్చర్యపోతున్నారు. కొడాలి నాని శిబిరంలో ఇలాంటి వాతావరణం నెలకొనడం ఇదే ప్రఽథమమంటూ వ్యాఖ్యలు వినవస్తున్నాయి. చేరికల పేరిట హడావుడి చేస్తూ కొడాలి నాని తన కేడర్‌లో ధైర్యం నింపేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వినవస్తు న్నాయి. తమ నుంచి ఒక్కరూ వైసీపీలోకి వెళ్లలేదని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

 

gudivada 3102019

సీఎం చంద్రబాబు శుక్రవారం గుడివాడ అభివృద్ధికి ఇచ్చిన హామీలు ప్రజల్లో ఉత్సాహం నింపాయి. కీలకమైన ఔటర్‌రింగ్‌ రోడ్‌ ఏర్పాటుతో నలుదిశలా అడ్డంకులతో కుచించుకుపోయిన గుడివాడ పట్టణ పరిధి పెరిగే అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు. విజయవాడ- గుడివాడ రోడ్డును నాలుగు వరసలుగా మారుస్తామని హామీ ఇవ్వడాన్ని ముఖ్య పరిణామంగా భావిస్తున్నారు. చేపలు, రొయ్యల చెరువులు అధికంగా ఉండే నందివాడ మండలంలో ఆక్వా హబ్‌ ఏర్పాటు, రవాణ రంగానికి ఊతమిచ్చేలా లాజిస్టిక్స్‌ హబ్‌ ఏర్పాటుకు నిర్ణయాలు వెల్లడించడం వంటివి అభివృద్ధికి కీలక ముందడుగుగా పరిశీలకులు భావిస్తున్నారు. గుడివాడ అభివృద్ధికి తాను స్పష్టమైన రూట్‌మ్యాప్‌తో వచ్చానని చెప్పిన దేవినేని అవినాష్‌ తొలి సభలోనే ముఖ్యమంత్రి వద్ద వాటిని ప్రస్తావించి ఆమోదముద్ర పొందడం విజయానికి సంకేతంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.

ఆర్థికంగా స్థితిమంతుడైన మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి వైసీపీ గూటికి చేరాడని ఉత్సాహంతో ఉరకలు వేసిన ఆ పార్టీ వర్గాలు ప్రస్తుతం ఆత్మవలోకనంలో పడ్డాయి. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వైసీపీ అసెంబ్లీ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. ఏ పార్టీలో ఉన్నా ఆదాల తనదైన వ్యక్తిగత రాజకీయానికి ప్రాధాన్యం ఇస్తారనే ఆ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి. సాక్షాత్తు తన వియ్యంకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డితో గత పార్లమెంటు ఎన్నికల్లో తలపడినప్పుడు ఆదాల మార్కు రాజకీయాన్ని వైసీపీ అభ్యర్థులు చవిచూశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధం లేకుండా ఆదాల తన విజయానికి అడ్డదారి తొక్కడంతో వైసీపీ పార్లమెంటు అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి బోటాబోటి మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

aadala 31032019

చివరి నిమిషంలో వైసీపీలో చేరిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి, రాక తమకు లాభం కంటే నష్టం చేకూర్చుతుందని సాక్షాత్తు ఆ పార్టీకి చెందిన నాయకుడు వ్యాఖ్యానించడం గమనార్హం. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటూ కాంట్రాక్టు బిల్లులు మంజూరు అనంతరం, పార్టీ మారడంతో ఆదాల ఇటు ప్రజల్లోనూ, అటు రెండు పార్టీల్లోనూ తీవ్ర విమర్శలకు గురికావాల్సి వచ్చింది. తరచూ పార్టీలు మారే నేతగా ముద్ర వేసుకోవాల్సి వచ్చింది. ఆదాల వ్యవహార శైలితో తెలుగుదేశం కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చివరకు ఆయన అనుచరులుగా ఉన్న రూరల్‌ నియోజకవర్గంలో కొందరు కార్పొరేటర్లు, ద్వితీయ శ్రేణి నాయకులు సైతం ఆదాల వెంట వెళ్లలేదు.

aadala 31032019

అలాగే సొంత నియోజకవర్గం కావలిలో పటిష్టంగా ఉన్న బీసీ నాయకుడు బీద మస్తాన్‌రావు పార్లమెంటు అభ్యర్థిగా తానే ప్రోత్సహించి, చివరకు పార్టీ మారి ప్రత్యర్థిగా మారడంపై ‘ఇంత మోసమా...’ అంటూ బీసీ వర్గాలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆదాలపై జనాగ్రహం తమపై పడుతుందేమోనని వైసీపీ వర్గాలు ఆందోళనలో ఉన్నాయి. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం అన్ని పార్టీల నాయకులను వశపరుచుకోవడంలో దిట్టగా ఆదాలకు పేరుంది. ప్రస్తుతం తన విజయానికి మాత్రమే పని చేసే బృందాలను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు సిటీ, రూరల్‌ నియోజకవర్గాలలో ఈ బృందాలు చురుగ్గా పని చేస్తున్నట్లు సమాచారం. ఆదాల మార్క్‌ రాజకీయంతో ఈ దఫా ఎన్నికల్లో ఎవరు నష్టపోతారో, ఆదాలకు అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌ ప్రభావం ఎవరి పుట్టి ముంచుతుందో వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read