వైఎస్ జగన్ జుట్టు ప్రధాని మోడీ చేతుల్లో ఉంటే.. పిలక తెలంగాణ సీఎం కెసిఆర్ చేతుల్లో ఉందన్నారు సీఎం చంద్రబాబు. పాయకరావుపేటలో చంద్రబాబు రోడ్‌షో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘దేశంలో ఉన్న అన్ని మోసాలకు జగన్ కేంద్రంగా ఉన్నాడు. జగన్ జుట్టు మోదీ చేతిలో.. పిలక కేసీఆర్ చేతిలోఉంది. జగన్ రాష్ట్రాన్ని ముంచడానికి ఒక్క అవకాశం అంటున్నారు. జగన్ జైలుకు వెళ్లకుండా ఉండడానికి మేం ఓట్లు వేయాలా? కేసీఆర్ ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా? గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి.. ఇష్టానుసారం వ్యవహరిస్తే ఖబడ్దార్’’ అని చంద్రబాబు హెచ్చరించారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నా.. ఇంకా అక్కడే ఉంటే ఆంధ్రాకి నేను ద్రోహం చేసినవాడినే అవుతానని కట్టుబట్టలతో విజయవాడకి వచ్చి అమరావతికి శంఖుస్థాపన చేశానని.. జగన్ ఇప్పటికీ హైదరాబాద్ ముద్దు ఆంధ్రా వద్దు అని లోటస్ పాండ్‌లోనే భోగాలు అనుభవిస్తున్నాడు.
ఎన్నికలు వచ్చేసరికి ఇప్పుడు అంత చేస్తా.. అన్నీ నేనే చేస్తానని ఇష్టం వచ్చినట్లు, నోటికి వచ్చినట్లు వాగ్దానాలను చేస్తున్నారన్నారు. అయన చేసే వాగ్దానాలను విన్న ప్రజలు ఒక్కరైనా నమ్ముతున్నారా? నలభై ఏళ్ళు అనుభవం, ప్రపంచం మొత్తం మీద తెలిసిన నాకు ఐదేళ్లు పట్టింది రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి.. వారానికి ఒకరోజు కోర్టుకు వెళ్లే జగన్ ఇంకేం చేస్తాడని ప్రజలే ప్రశ్నిస్తున్నారన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఏపీ సీఎం చంద్రబాబు ఎద్దేవాచేశారు. కేసీఆర్‌ది తుక్కు ఫెడరల్ ఫ్రంట్ అని చంద్రబాబు విమర్శించారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద రూ.5 లక్షలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. మీకు నచ్చిన ఆస్పత్రిలో వైద్యం చేయించుకోండన్నారు. మందులకు కూడా డబ్బు చెల్లిస్తామని భరోసా ఇచ్చారు.
రూ.10 లక్షల విలువైన ఇళ్లను కట్టిస్తున్నామని, పేదల గృహాల బకాయిలు రూ.9300 కోట్లను మాఫీ చేస్తున్నామని తెలిపారు. 43 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చామని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఏ మొహం పెట్టుకొని మన గడ్డపైకి వస్తున్నారని ప్రశ్నించారు. కియా మోటార్స్ మోదీ తెచ్చారనడానికి జగన్‌కు సిగ్గుండాలన్నారు. తన వల్లే కియా మోటార్స్ అనంతపురం వచ్చిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణకు మనం బానిసలం కాదని, కేసీఆర్‌కు ఊడిగం చేయాలనుకుంటే జగన్ అక్కడే ఉండాలని చెప్పారు. అమరావతి అభివృద్ధి అయితే.. హైదరాబాద్ ఎత్తిపోతుందని కేసీఆర్ భయపడుతున్నారని మరోసారి ఎద్దేవాచేశారు. జగన్‌వి అన్నీ కోడి కత్తి ఆలోచనలేనని విమర్శించారు. ఒక్క సారి అవకాశం ఇద్దామని మనం ఆత్మహత్య చేసుకుంటామా అని ప్రశ్నించారు. మన పిల్లల భవిష్యత్ అంధకారం చేసుకుంటామా అని చంద్రబాబు మరోసారి ప్రశ్నించారు.