మంత్రి దేవినేని ఉమ.. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. కీలకమైన జలవనరుల శాఖకు మంత్రిగా ఉన్నారు. 1999 నుంచి ఓటమెరుగని నేత.. మైలవరం బరిలో వరుసగా మూడోసారీ గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.. ఇటు వైసీపీ తరపున బరిలోకి దిగిన వసంత కృష్ణప్రసాద్.. ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు ఒకప్పుడు టీడీపీలో సీనియర్ నేత. ఎన్టీఆర్ కేబినెట్‌లో హోంమంత్రిగా కూడా పనిచేశారు. కాలక్రమంలో కాంగ్రెస్‌లోకి వెళ్లి.. ఇప్పుడు వైసీపీలో చేరారు. తన కుమారుడిని మైలవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దించారు. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం. అంగబలం, అర్థ బలంలో ఒకరికొకరు తీసిపోరు. ఇద్దరు ఉద్దండుల నడుమ ఈ నియోజకవర్గంలో హోరాహోరీ సమరం సాగుతోంది.
కృష్ణా జిల్లా మైలవరంలో ఈ దఫా రాజకీయ వైరమే ప్రాతిపదికగా ఎన్నికలు జరుగుతున్నాయి. దేవినేని నందిగామ జనరల్ స్థానంలో 1999లో కాంగ్రెస్ అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్‌ను 23 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో ఓడించారు. 2004 ఎన్నికల్లో వసంత నాగేశ్వరరావే కాంగ్రెస్ తరపున బరిలోకి దిగారు. దేవినేనికి గట్టి పోటీ ఇచ్చినా పరాజయం పాలయ్యారు. నాటి రాజకీయ వైరం ఇంకా కొనసాగుతోంది. కాలక్రమంలో నందిగామ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా మారడంతో దేవినేని మైలవరం స్థానాన్ని ఎంచుకుని 2009, 14ల్లో విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు మంత్రివర్గంలో కీలక మంత్రిగా మారారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను ఎప్పటికప్పుడు తీవ్రంగా విమర్శించే దేవినేనిని ఈ సారి ఎలాగైనా ఓడించాలని వైసీపీ కంకణం కట్టుకుంది.. అన్ని విధాలుగా ఆయన్ను ఎదుర్కోగలవారెవరా అని అన్వేషించింది.
వసంత కృష్ణప్రసాద్‌ను ఎంచుకుంది. ఆరు నెలల ముందే ఆయన్ను రంగంలోకి దించడంతో ఇది ప్రతిష్ఠాత్మక పోరుగా మారింది. మైలవరంలో మరోసారి టీడీపీ జెండా ఎగురవేసే లక్ష్యంతో దేవినేని పావులు కదుపుతున్నారు. చేసిన అభివృద్ధి కార్యక్రమాలు.. చంద్రబాబు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తనను గెలుపు తీరాలకు చేరుస్తాయని విశ్వసిస్తున్నారు. ఇంకోవైపు.. కృష్ణప్రసాద్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన పార్టీ మైండ్‌గేమ్ ఆడుతోంది. టీడీపీ బూత్ స్థాయి కన్వీనర్లకు వైసీపీ కాల్‌సెంటర్ నుంచి ఫోన్లు చేస్తూ వారిని వైసీపీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించడం పెద్దదుమారమే రేపింది. వసంత అనుచరులు ఏకంగా పోలీసులనే ప్రలోభపెడుతూ అడ్డంగా దొరికిపోయారు. జగన్ అక్రమార్జన కేసులో కృష్ణప్రసాద్‌కూ ప్రమేయం ఉంది. ఆయన కూడా జగన్‌తోపాటు సీబీఐ కోర్టుకు హాజరవుతుంటారు. టీడీపీకి అనాదిగా బీసీలే అండగా ఉంటూ వస్తున్నారు. మైలవరంలో మొత్తం 2,68,463 మంది ఓటర్లు ఉంటే బీసీలు 1.20 లక్షలు.