రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫామ్-7 ఫిర్యాదుల్లో దాదాపు అన్నీ తప్పుడువేనని పోలీసుల దర్యాప్తులో బయటపడుతోంది. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన పేర్ల ఆధారంగా ఎవరిని విచారించినా ‘మాకు తెలియదు’ అనే సమాధానమే వస్తోంది. దీంతో ఐపీ అడ్ర్‌సల ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అసలు సూత్రధారులను గుర్తించే పనిలో పడింది. సిట్ అధిపతి ఐజీ సత్యనారాయణ బుధవారం రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదితో భేటీ అయ్యారు. ఫిర్యాదుల్లో నకిలీవిగా భావిస్తున్న 2.74 లక్షల దరఖాస్తులకు సంబంధించి ఐపీ అడ్ర్‌సలు కావాలని కోరారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజక వర్గాల్లోనూ ఓట్ల తొలగింపునకు ఫామ్-7 దరఖాస్తులను ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. వారిచ్చిన చిరునామా ఆధారంగా దర్యాప్తు చేసేందుకు వెళ్లిన పోలీసులు... ‘ఓటు తొలగించాలని మీరు ఫిర్యాదు చేశారు కదా?’ అని అడగ్గానే ‘నేనా...’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమ పేరుతో ఫిర్యాదు చేసిన విషయం కూడా చాలామందికి తెలియదు. ఫిర్యాదుదారుల్లో ఎక్కువమంది నిరక్షరాస్యులే ఉన్నట్లు విచారణలో వెలుగులోకి వస్తోంది.
ఒక్కరోజే 1.50లక్షల దరఖాస్తులు.. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల తొలగింపు దరఖాస్తులు ఈసీకి పంపాలని వైసీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఫిబ్రవరి చివరివారంలో కేడర్‌కు ఆదేశాలు వెళ్లాయి. తెలంగాణలో డేటా చోరీ వివాదం కూడా అప్పుడే మొదలైంది. మొత్తం వ్యవహారాన్ని అటువైపు మళ్లించిన ఆ పార్టీ అదే అదనుగా ఫిబ్రవరి 27న ఒక్కరోజే 1.50లక్షల ఫామ్-7 దరఖాస్తులను అప్లోడ్ చేసింది. అయితే ఈ విషయాన్ని అధికార పార్టీ గుర్తించింది. అప్పటికే ఎలక్టోరల్ ఆఫీసర్లు వాటిపై విచారణ ప్రారంభించారు. దాదాపు అన్నీ నకిలీ ఫిర్యాదులని తేలడంతో కేసులు నమోదవడం, సిట్ ఏర్పాటు చేయడం, ఎవరి ఓటూ తొలగించడం లేదంటూ ఈసీ ప్రకటించడం వెంటవెంటనే జరిగిపోయాయి.
ఫామ్-7 కేసుల్లో కీలకమైన ఐపీ అడ్ర్‌సల కోసం ఇప్పటికే ఈసీని కోరామని, తాజాగా సీడాక్ సంస్థకు లేఖ రాశామని సిట్ అధిపతి సత్యనారాయణ తెలిపారు. వివరాలు అందిన వెంటనే దర్యాప్తు వేగవంతం చేస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ ఫిర్యాదులందాయని, అత్యధికంగా తిరుపతిలో 10,980 దరఖాస్తులపై విచారణ చేస్తున్నామని చెప్పారు. అనకాపల్లిలో 10,200, చీపురుపల్లి 8,214, గాజువాక 5,785, అనపర్తి 7,088, గోపాలపురం 7,800, భీమవరం 5వేలు, ఆదోని 5,110, కడప 5,501, ధర్మవరం 6,804 ఇలా రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5వేలకు పైగా తప్పుడు ఫిర్యాదులు వచ్చినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి.