‘‘కేసీఆర్ జగన్‌కు రెండు వేల కోట్లు పంపించి... ఏపీకి రావాల్సిన లక్ష కోట్ల ఆస్తిని ఎగవేద్దామనుకుంటున్నారు! దుష్టశక్తులన్నీ ఏకమై నాపైనా, రాష్ట్రంపైనా దాడి చేస్తున్నాయి. మనకు పౌరుషం లేదా! రాష్ట్రంపై దాడి చేస్తే ఊరుకుంటామా! ఏపీని హైదరాబాద్ నుంచి పాలిస్తే సహిస్తామా?’’ అని తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ప్రశ్నించారు. ఇప్పటిదాకా జిల్లాల వారీగా పార్టీ శ్రేణులతో సమావేశమైన ఆయన... బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అసలైన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని ప్రధాన రహదారి పొడవునా జరిగిన రోడ్‌షో నిర్వహించారు. భారీగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మోదీ, కేసీఆర్, జగన్‌లపై విరుచుకుపడ్డారు. అంతకుముందు విజయవాడలో జరిగిన మరో సభలోనూ మాట్లాడారు.
‘‘ఆంధ్రాకు వస్తామని కేసీఆర్ అంటున్నారు. రావయ్యా రా... అటో ఇటో తేలిపోతుంది!’’ అని సవాలు విసిరారు. తెలంగాణలోని ఆస్తులను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలను భయపెడుతున్నారని తెలిపారు. ‘‘ఏదో లిటిగేషన్ సృష్టించి బెదిరిస్తున్నారు. వైసీపీతో కలిసి పోవాలంటున్నారు. ఇదేం న్యాయం? మా ఇల్లు మీకెంత దూరమో... మీ ఇల్లు మాకూ అంతే దూరం. ఈ విషయం మరిచిపోవద్దు. ప్రాణాలు పోయినా సరే! పోరాటం ఆపేదిలేదు. నాతో పెట్టుకోకండి. ఖబడ్దార్. మీరు ఒక్క రిటర్న్ గిఫ్ట్ ఇస్తే... ఇక్కడున్న మా వాళ్లు వంద ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు’’ అని హెచ్చరించారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడకుండా టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని, అన్ని రకాల ఆర్థిక మూలాలపై దాడి చేసి తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా, వారిని లొంగదీసుకునేనా ఒత్తిడి తెస్తోందని తెలిపారు. పోలవరంపై కేసీఆర్ సుప్రీం కోర్టుకు వెళ్లారని తెలిపారు.
జగన్‌కు ఓటేస్తే వీధికో రౌడీ పుట్టుకొస్తారని, రాష్ట్రం రౌడీ రాజ్యమవుతుందని తెలిపారు. ఆయనకు ఓటేస్తే మన మరణశాసనం మనమే రాసుకున్నట్లు అవుతుందన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ హత్యా రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు. జగన్ అది చేసా, ఇది చేస్తా అంటున్నారని... అసలు ఆయన ఏం చదువుకున్నారో చెప్పరని చంద్రబాబు విమర్శించారు. ‘నేను ఎం.ఏ. ఎనకనిక్స్ చేశారు. మరి... మీరేం చదివారు’ అని జగన్‌ను ప్రశ్నించారు. నేరస్తుడైన జగన్ అధికారంలోకి వస్తే... రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా అని అడిగారు. ‘‘ఐదేళ్లు కష్టపడ్డాం. అందరూ సహకరించారు. ఇప్పుడు మీ ఓటు అడుగుతున్నా. పులివెందులలో సైతం మనమే గెలవాలి’’ అని పిలుపునిచ్చారు.