ఇప్పటికే ఫారం-7 తో రచ్చ రాచ్చ చేస్తున్న జగన, ఇప్పుడు ఏపిలోని, తెలంగాణా బోర్డర్ ఊళ్ళు టార్గెట్ గా, కేసీఆర్ తో కలిసి, మరో ఓటు స్కాంకు తెర లేపారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త వివాదం ప్రారంభమైంది. కృష్ణాజిల్లా వీరులపాడు మండలం, పద్దాపురం గ్రామంలో తెలంగాణ సహా ఇతర ప్రాంతాలకు చెందినవారి ఓట్లను చేర్చారంటూ స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు వీరులపాడు తాహశీల్దారు కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జిల్లాల్లో తెలంగాణకు సంబంధించిన ఓటర్లను ఏపీలో చేర్చడంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అసలు వాళ్ళు ఎవరూ మా ఊరిలోనే లేరని, వీళ్ళు ఎవరూ అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
దీనికి సంబంధించి గురువారం ఉదయం పెద్దాపురం గ్రామంలో తెలంగాణకు సంబంధించిన 70 ఓట్లను చేర్చారు. వారంతా టీఆర్ఎస్, వైసీపీ సానుభూతిపరులని.. ఆ గ్రామం టీడీపీ నేతలు ఎమ్మార్వో దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఈ విషయం తన దృష్టికి రాలేదని ఎమ్మార్వో చెప్పడంతో టీడీపీ నేతలు భగ్గుమన్నారు. ఎమ్మార్వో, బూత్ లెవెల్ అధికారులకు తెలియకుండా ఈ ఓట్లు ఎలా చేర్చారని ప్రశ్నించారు. పైగా తెలంగాణ ఆధార్ కార్డు ఉన్నప్పుడు, ఏపీ ఓటర్ల జాబితాలో ఈ ఓట్లు ఎలా వచ్చాయని నిలదీయడంతో అధికార్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. అయితే తెలంగాణా బోర్డర్ ఊళ్ళు టార్గెట్ గా, మరో కొత్త కుట్రకు తెర లేపారని, తెలుస్తుంది.
మరో పక్క ఫారం-7 పై చంద్రబాబు మాట్లాడారు. దుష్టశక్తులన్నీ ఏకమై కుట్రల మీద కుట్రలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘తప్పులు చేయడానికి ఫారం-7 వాడటం నేరం. వాటిని దుర్వినియోగం చేశామని వైకాపా అధ్యక్షుడు జగనే అంగీకరించారు. ఓట్లుపోయిన వాళ్లంతా ఆయన్ని నిలదీయాలి. ఏకంగా 13 లక్షల ఫారం-7లను పంపించారు. బెంగళూరు, హైదరాబాద్‌ల నుంచే ఈ కుట్ర జరిగింది. ఓటర్ల జాబితాలో పేరుందో లేదో సరిచూసుకోవాలి’ అని చెప్పారు. ‘తెదేపా గెలిస్తే తమ ఆటలు సాగవనేదే వారి భయం. నేనెప్పుడూ నేరాలకు పాల్పడను. నేరగాళ్ల అరాచకాలను సహించను. పిచ్చి పిచ్చి ఆటలాడితే సహించేది లేదు’ అని స్పష్టంచేశారు.