నిన్న సాయంత్రం, సరిగ్గా 6 గంటల సమయంలో, మీడియాకు రైల్వే మంత్రి ఆహ్వానం పంపారు. 7 గంటల 15 నిమషాలకు రమ్మని, ఏపి పై ముఖ్యమైన ప్రకటన ఉంటుంది అన్నారు. మోడీ వచ్చే రెండు రోజులు ముందైనా, రాజకీయం కోసమైనా, ఆందోళనలకు తలొగ్గి అయినా రైల్వే జోన్ ప్రకటిస్తున్నారు అంటూ, ఆ ప్రకటన కోసం అందరూ ఎదురు చూసారు. చెప్పినట్టు గానే, బుధవారం రాత్రి 7 గంటల 15 నిమషాలకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఆకస్మికంగా విశాఖ రైల్వేజోన్‌పై ప్రకటన చేశారు. దీంతో ఒక్కసారిగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కానీ... ఆ ప్రకటన లోతుపాతుల్లోకి వెళ్లాకగానీ ఇందులోని గిమ్మిక్కులు బయటపడలేదు. మోడీ/షా ల మోసం గురించి తెలిసి కూడా, నమ్మి సంతోష పడినంత సమయంలోనే, వీళ్ళ మోసం తెలుసుకుని బాధపడాల్సిన పరిష్తితి.
వివరాల్లోకి వెళితే... ఇప్పటిదాకా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లతో ‘విశాఖపట్నం రైల్వేజోన్’ ఏర్పాటు చేస్తున్నట్లు పీయూష్ ప్రకటించారు. అత్యంత కీలకమైన, 125 ఏళ్ల చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్‌ను కేంద్రం చరిత్రలో కలిపేసింది. ఈ డివిజన్‌ను రెండు ముక్కలు చేసింది. ఒక ముక్కను విజయవాడ డివిజన్లో కలిపారు. మరో ముక్కతో ఒడిసాలోని రాయగఢ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే... విశాఖ కేంద్రంగా జోన్ ఉంటుందికానీ, డివిజన్ ఉండదు. ఇది తలలేని మొండెంతో సమానమే! విశాఖ జోన్‌గా ఉన్నప్పటికీ... డివిజన్ ఉండదు. వాల్తేర్ డివిజన్‌తో మనకు వచ్చిన ‘వాటా’.
వాల్తేర్ డివిజన్ ఆదాయంలో దేశంలోనే ఐదో స్థానంలో ఉంది. గత ఏడాది రూ.7,500 కోట్ల ఆదాయం సంపాదించి పెట్టింది. కోరాపుట్, కిరండోల్ లైన్ల పరిధిలో బైలదిల్లా గనుల నుంచి ఇనుప ఖనిజం రవాణాయే దీని ప్రధాన ఆదాయ వనరు. ఇప్పుడు... ఇప్పుడు ఈ ఆదాయమంతా కొత్తగా ఏర్పడనున్న రాయగఢ డివిజన్‌కు దక్కుతుంది. ప్రయాణికుల ఆదాయం మాత్రమే విశాఖ జోన్ పరిధిలోకి వస్తుంది. విశాఖలోని రెండు పోర్టుల వరకు ఇనుప ఖనిజం రవాణా అయినప్పటికీ ఇసుమంత ఆదాయం కూడా మన జోన్‌కు రాదు. కేకే లైన్లో అరకు వరకు అత్యంత క్లిష్టమైన రైల్వే మార్గం. దీని నిర్వహణ భారం మాత్రం విశాఖ జోన్ నెత్తిన పడుతుంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ ఉన్న రైల్వే స్టేషన్లు ఖుర్దా (ఒడిసా) డివిజన్లో ఉన్నాయి. ఇకపైనా అలాగే ఉంటాయి. వీటన్నింటినీ విశాఖ జోన్లో కలపాలన్నది ఉత్తరాంధ్ర వాసుల డిమాండ్. దీనిని కూడా మోదీ సర్కారు నెరవేర్చలేదు. విశాఖ రైల్వే జోన్ కేవలం భావోద్వేగ అంశం మాత్రమే కాదు! ఇది నిరుద్యోగ యువత జీవితాలతో ముడిపడినది. జోన్‌తోపాటు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డును కూడా ఇస్తారా? అనే అంశంపై స్పష్టత లేదు.