రాష్ట్ర ద్రోహుల ఏడుపులు మరోసారి వినాల్సిన పరిస్థితి. ఎందుకంటే, ‘కియ’ కారు ఈనెల 29న రోడ్డెక్కనుంది. తొలి కారును ఆ రోజున ప్రయోగాత్మకంగా పరుగులు తీయిస్తారు. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని కియ కార్ల ప్లాంటులో దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పరిశ్రమ ప్రాంగణంలో 84.14 ఎకరాల్లో బాడీషాప్, పెయింట్‌షాప్, అసెంబ్లీ షాప్, ఇంజిన్ షాప్, ప్రెస్‌కు సంబంధించిన భవనాలు నిర్మించారు. ఐరన్ ఫ్రేమ్ కు సంబంధించిన ఆ నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. అంటే... తొలి కారు తయారీకి రంగం పూర్తిగా సిద్ధమైందన్న మాట. పరిశ్రమ ప్రాంగణంలోనే రైడింగ్ ట్రాక్ నిర్మించారు. తొలి కారును కియ ఎండీ, సీఎం చంద్రబాబు నడుపుతారు.
ఈ కార్యక్రమంలో దక్షిణ కొరియా రాయబారి కూడా పాల్గొంటారు. లక్ష్యం ప్రకారం 2018 డిసెంబరులోనే కియ ప్లాంటు నుంచి తొలి కారు రావాల్సి ఉంది. కానీ, నెల ఆలస్యమైంది. ఐదు దశల్లో భూమి చదును: 2016 అక్టోబర్ నుంచి నవంబర్ 15కల్లా ఈ పనులు పూర్తి చేశారు. కొటక్ మహీంద్ర, హెచ్‌సీ, 12స్టోన్, ఎల్ఎన్డబ్ల్యు, ఎల్ అండ్ టీ, హుండయ్ ఇంజీరింగ్ కంపెనీ, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలు భూమి చదును పనులను పూర్తి చేశాయి. చెప్పిన సమయానికంటే ముందే కియ కార్ల పరిశ్రమకు అవసరమైన భూమిని ఆ కంపెనీలు చదును చేసి కియకు అప్పగించాయి. కియ పరిశ్రమలో ప్రధానంగా రెండు కంపెనీల తయారీ విభాగాలు ఏర్పాటయ్యాయి. అందులో కియ పరిశ్రమకు చెందిన బాడీషాప్, పార్ట్స్ షాప్, ప్రెస్ షాప్, అసెంబ్లీ, ఇంజిన్ షాప్, కాయిల్ సెంటర్ అనే ఆరు విభాగాలు తమతమ పనులకు సిద్ధంగా ఉన్నాయి.
అదే తరహాలో హుండయ్ కంపెనీ కూడా ఆరు విభాగాలను సిద్ధం చేసింది. హుండయ్ మోబిస్, హుండయ్ డైమోస్, హుండయ్ గ్లోవిస్, హుండయ్ గ్లోవిస్ యుపీసీ, హుండయ్ డైమోస్ సీట్, హుండయ్ స్టీల్ అనే విభాగాలు కార్ల తయారీ కోసం సిద్ధంగా ఉన్నాయి. అట్లాంటా తరువాత ఇక్కడే..: అనంతపురంలో కియ చేపట్టింది ఎనిమిదో ప్లాంటు. అయినా, కొరియాలో కంటే లేటెస్ట్ టెక్నాలజీతో కార్లు ఇక్కడ తయారవుతున్నాయి. జెకోస్లోవేకియా, చైనా, మెక్సికో, అమెరికాలోని అట్లాంటా తదితర దేశాల్లో కియ ప్లాంట్లు ఉన్నాయి. అట్లాంటా ప్లాంటు సాంకేతికపరంగా అత్యాధునికమైందని ఇప్పటిదాకా భావించారు. అందులో ఇప్పటికే బ్యాటరీ కార్లు సిద్ధమయ్యాయి. అనంతపురం ప్లాంట్‌లో కూడా బ్యాటరీ కారు తయారీని అదనపు ఫీచర్‌గా ప్రకటించే అవకాశాలున్నాయి. ప్రతి గంటకు 34 కార్లు: ఈ ప్లాంటులో గంటకు 34 కార్లు తయారవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన రోజుకు 821 కార్లు, సంవత్సరానికి 3 లక్షల కార్లు తయారవుతాయి.