నవ్యాంధ్ర అభివృద్ధి కోసం తీరికలేకుండా గడుపుతున్న చంద్రబాబు స్వగ్రామంలో సంక్రాంతిని కుటుంబంతో గడిపారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వగ్రామమైన నారావారిపల్లెలో నారా వారి కుటుంబసభ్యులందరూ రెండు రోజుల పాటు సందడి చేశారు. గత కొన్నేళ్లుగా కొనసాగిస్తున్న ఆనవాయితీ ప్రకారం భోగి పండుగ రోజు సాయంత్రమే గ్రామానికి చేరుకున్న చంద్రబాబునాయుడు ఆ రాత్రి కుటుంబ సభ్యులు, సన్నిహితులతో గడిపారు. సంక్రాంతి పండగ రోజున ఉదయం కుటుంబసభ్యులతో కలిసి గ్రామదేవత అయిన నాగాలమ్మ గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఆ పై తన తల్లదండ్రుల సమాధుల వద్దకు వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు.
ఇంటి వద్ద చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులతో, బంధువులతో సన్నిహితులు, పార్టీ నాయకులతో కలసి విందును స్వీకరించారు. పంచెకట్టుతో కనిపించిన సీఎం, మనవడ్ని కూడా పంచె కట్టులో చూసి మురిసిపోయారు. ఇది ఇలా ఉంటే, ఆరు పదుల వయసులో కూడా, కుటుంబానికి దూరంగా, రాష్ట్రం కోసం అనునిత్యం కష్టపడుతున్న చంద్రబాబు, ఒక రెండు రోజులు అన్నీ పక్కన పెట్టి, కుటుంబ సభ్యులతో గడపటంతో, ఆయన అభిమానులు కూడా సంతోషిస్తున్నారు. ఎప్పుడూ పనిలోనే నిమగ్నమయ్యే చంద్రబాబుకు, ఎట్టకేలకు రెస్ట్ దొరికింది అంటూ, సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు కూడా సరదాగా కనిపించారు. ఆదునిక యుగంలో టెక్నాలజి ఆవశ్యకత ఉన్నదని దీనిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా జీవితం ఆనందమయంగా ఉంటుందన్నరు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని ఆనంద రాష్ట్రంగా నిలుపుకుందామన్నారు. అత్యంత పవిత్రంగా జరుపుకునే సంక్రాంతి విశిష్టతను మరింత పెంచే విధంగా రాష్ట్రపండుగగా నిర్వహిస్తున్నామన్నారు. మన సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు వెలుగులోనికి తీసుకు వచ్చేవిధంగా అందుకు అనుగుణంగా నిర్ణయాలు చేస్తున్నామన్నారు. జన్మభూమి, తల్లితండ్రులు, పెద్దలను మరిచిపోరాదని, పాత గుర్తులను నెమరు వేసుకోవాలన్నారు. రాష్ట్రం బాగుంటే, దేశం బాగుంటుందని నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన ముహర్తం వలన చేపట్టిన ప్రతికార్యక్రమము త్వరితగతిన పూర్తి కావడం శుభసూచికమన్నారు.