వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తన విహార యాత్రను ముగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. ప్రతి వారం ఇంటికి వెళ్తూ చేసిన ఫ్యాన్సీ యాత్రకు పవిత్రత ఎక్కడుంటుందని ఆయన ప్రశ్నించారు. తాను అర్ధరాత్రి దాటాకా కొన్ని రోజులు నడిచిన సందర్భాలున్నాయని, కానీ ఏనాడైనా రాత్రి 7 గంటల తరువాత జగన్ పాదయాత్ర చేశారా? అని నిలదీశారు. రోజుకు 8 కిలోమీటర్లు నడిస్తే దానిని పాదయాత్ర అంటారా? వారానికోసారి విశ్రాంతి తీసుకుని చేసేది పాదయాత్రా? అని ప్రశ్నించారు. బుధవారం రాత్రి ఉండవల్లిలోని ప్రజా వేదికలో విలేకరులతో కొద్దిసేపు ఇష్టాగోష్ఠిగానూ, అంతకుముందు ప్రకాశం జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లోనూ చంద్రబాబు మాట్లాడారు. ప్రజల మనోభావాలకు తగ్గట్లే రాష్ట్రంలో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని, కాంగ్రెస్‌తోనూ ఇదే తరహాలో వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
ఈనెల 19న కోల్‌కతాలో మమతా బెనర్జీ నిర్వహించే సభ రోజున అమరావతిలో ధర్మపోరాట సభ తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సరైన సమయంలో పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. అప్పట్లో జగన్ చేసిన అవినీతి కారణంగా రాష్ట్రం ఎన్నో ఆస్తులను కోల్పోయిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘రాష్ట్రం పరపతి పోయింది. అధికారులు, పారిశ్రామికవేత్తలు జైలుకు వెళ్లారు. ఆస్తులు నిరుపయోగమయ్యాయి’ అంటూ అప్పటి వాన్‌పిక్ భూముల వ్యవహారాన్ని గుర్తు చేశారు. ‘ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఎన్నికలకు ముందు ఇవ్వడాన్ని ఏమనుకోవాలి. అదీ తెదేపా ఎంపీలను సస్పెండు చేసి మరీ బిల్లును ప్రవేశపెట్టారు."
"అత్యంత కీలకమైన ఈ బిల్లులో తెదేపాను భాగస్వామిని చేయలేదు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. కోడి కత్తి కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వం చట్ట ప్రకారం వ్యవహరించడం లేదు. ఆ కేసును ఎన్ఐఏకు అప్పగించడం రాష్ట్ర అధికారాల్లోకి కేంద్రం చొరబడటమే. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాల్లో ఎన్ఐఏ జోక్యాన్ని మోదీ వ్యతిరేకించారు. ఇప్పుడు దాన్నే మన రాష్ట్రంపై ప్రయోగిస్తున్నారు. భవిష్యత్తులో నేను ఎవరినో కొట్టానంటూ తప్పుడు కేసులు బనాయించినా ఆశ్చర్యపోనవసరం లేదు. అమరావతి భూముల్లో అవినీతి అంటున్నారు. ఆ భూములను రైతులే ముందుకొచ్చి ఇచ్చారు. వారికి తిరిగి 30 శాతం అధికంగానే ప్రయోజనం చూపిస్తాం. రాష్ట్రంలో మళ్లీ తెదేపా అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.