సినీ నటుడు అలీ గత కొన్ని రోజులగా వార్తల్లో నిలుస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను అలీ కలిశారు. దీంతో ఆయన వైసీపీలోకి చేరనున్నారనే ప్రచారం జరిగింది. జగన్ పాదయాత్ర జనవరి 9వ తేదీన ముగియనుందని.. అదే రోజు అలీకి జగన్ స్వయంగా కండువా కప్పి వైసీపీలో చేర్చుకోనున్నట్లు వార్తలు హల్చల్ చేశాయి. దీంతో పవన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే అలీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడేంటనే చర్చ అటు పవన్ అభిమానుల్లోనూ, ఇటు వైసీపీ అభిమానుల్లోనూ జరిగింది. అలీ వైసీపీ ఎంట్రీ వార్తలకు తెరపడక ముందే తాజాగా ఆయన వేసిన మరో అడుగు ఈ పరిణామాలను గమనిస్తున్న వారిని షాక్‌కు గురి చేసింది.
‘అలీ నా గుండె లాంటి వ్యక్తి’ అని పవన్ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. అలాంటి పవన్ ఇంటికెళ్లి మరీ ఇవాళ అలీ భేటీ అయ్యాడు. దాదాపు రెండు గంటల పాటు వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్ట్‌లో జగన్‌ను కలిసిన అంశం కూడా పవన్‌తో భేటీలో చర్చకొచ్చినట్లు తెలిసింది. రాజకీయంగా అన్ని విధాలుగా అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారని, అలీ జనసేనలో చేరడం ఖాయమని జనసేన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే... ఈ ప్రచారం మొదలైన కాసేపటికే తాజాగా అలీ సినీ నిర్మాత అశ్వనీదత్‌తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో అలీ టీడీపీ టికెట్ ఆశించాడనే ప్రచారం కూడా జరిగింది.
ఈ నేపథ్యంలో అలీ టీడీపీ అధినేతను కలవడం చర్చనీయాంశమైంది. వైసీపీలో టికెట్‌పై హామీ దక్కకపోవడం వల్లే అలీ టీడీపీలోకి చేరాలని భావిస్తున్నాడనే వాదన కూడా వినిపిస్తోంది. దీంతో అలీ అంతరంగమేంటో తెలియని పరిస్థితి నెలకొంది. బీజేపీపై పోరాటానికి పవన్ కూడా కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చిన అనంతరం వైసీపీలో చేరాలన్న అలీ ఆలోచన మారి ఉండొచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. మూడు పార్టీల్లో ఏ పార్టీ నుంచి టికెట్ దక్కినా అలీ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలీని చేర్చుకుంటే మైనార్టీల అండ కూడా ఉంటుందనే భావన పార్టీల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలీ వ్యవహారమే హాట్ టాపిక్‌గా మారింది.