యోగి మోడల్ అంటూ హడావిడి చేసే బీజేపీ బ్యాచ్, ఇప్పుడు యోగి చేస్తున్న పని గురించి ఏమంటారో. లేక అదే మంచిదని, భజన చేస్తారో. ఇక విషయానికి వస్తే, ఉత్తర ప్రదేశ్లో ఆవుల సంరక్షణ కోసం కొత్తగా పన్నును విధించనున్నారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ‘గో సంరక్షణ సెస్’ పేరుతో దీన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఆవుల సంరక్షణకు పట్టణ, గ్రామీణ పౌర సంస్థల ఆధ్వర్యంలో తాత్కాలికంగా ‘గోవంశ్ ఆశ్రయ్ ఆస్థల్’లను ఏర్పాటు చేసే ప్రతిపాదనలను కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఇప్పటికే ఉన్న పన్నులకు తోడు, ఈ కొత్త పన్ను పై ప్రజలు భగ్గు మంటున్నారు.
అలాగే, అన్ని గ్రామాలు, పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఆవుల సంరక్షణ కోసం తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూడా ఒక్కో షెడ్డులో వెయ్యి పశువులకు ఆశ్రయం కల్పించే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎక్సైజ్, టోల్ ట్యాక్స్, ఇతర లాభదాయ కార్పొరేషన్స్పై ‘గో సంరక్షణ సెస్’ విధించనున్నట్లు తెలిపారు. చాలా మంది రైతులు తమ పశువులను వదిలేస్తున్నారని.. ఇలాంటి షెడ్ల వల్ల వాటికి ఆశ్రయం లభిస్తుందని, రోడ్లపై తిరిగే పశువులకు కూడా ఆశ్రయం కల్పించినట్లవుతుందని చెప్పారు. సంబంధిత విభాగాలు పరస్పర సహకారంతో ఆవుల సంరక్షణ చేస్తారని వెల్లడించారు.
ఇప్పటికే యూపీ ఎక్స్ప్రెస్ వే, ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ అథారిటీ, యూపీ రాష్ట్ర నిర్మాణం, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, యూపీ స్టేట్ బ్రిడ్జి కార్పొరేషన్, మండి పరిషత్, యూపీఎస్ఐడీసీలు గో సంరక్షణ కోసం ఒకశాతం సెస్ వసూలు చేస్తున్నాయి. ఈ సెస్ ను 2 శాతానికి పెంచాలని నిర్ణయించారు. ఈ సెస్ నిధులతో ప్రతీ జిల్లాలో వెయ్యి ఆవులను ఉంచేందుకు వీలుగా షెల్టర్లు నిర్మించాలని నిర్ణయించారు. ఈ నిధులతో గ్రామాలు, మున్సిపాలిటీల్లో గోసంరక్షణాలయాలు నిర్మించనున్నారు. ఈ సెస్ తోపాటు ఎమ్మెల్యే, ఎంపీల్యాడ్స్ నిధులతో కూడా ఆవుల కోసం షెల్టర్ల నిర్మాణానికి వినియోగించాలని నిర్ణయించారు. అయితే, గోవుల సంరక్షణ మంచేదే అయినా, అంత పెద్ద రాష్ట్రం సొంతగా ఖర్చు పెట్టచ్చు కదా, దాన్ని ప్రజల మీద భారం వెయ్యటం ఏంటి అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే సూపర్ మోడల్ అంటూ, దేశ వ్యాప్తంగా కూడా ఇలా చేస్తారేమో అనే విమర్శలు వస్తున్నాయి.