ధర్మపోరాట దీక్షలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటనలో తాడు ఉండ కలకలం రేపింది. శిల్పారామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్, ప్రధాన రహదారి మధ్య ప్రాంతంలో తాడుతో చుట్టిన ఉండ(నాటు బాంబు మాదిరిగా) కనిపించింది. పక్కనే సున్నపు గుర్తులు ఉన్నాయి. దీన్ని చూసి కొందరు భయపడి పోయారు. ఇంతకూ అదేమిటో గుర్తించలేకపోయారు. అయితే సాధారణంగా తోటల్లో పందులను బెదరగొట్టేందుకు ఉపయోగిం చే నాటుబాంబులాగా అది ఉండడం గమనార్హం. సీఎం పర్యటనలో ఈ ఉండ కలకలం రేపింది. పోలీసుల నిఘా పటిష్టంగా ఉన్నప్పటికీ అది కనిపించడం గమనార్హం.
నాలుగున్నరేళ్లలో అనంతలో భేషైన అభివృద్ధి జరిగింది. కేంద్రం సహకరించకపోయినా, రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా.. మునుపెన్నడూ లేనంతగా అభివృద్ధి చేసి చూపాం. రాష్ట్రంలో నీటి భద్రతతోపాటు, అనంతపురంలోని కరవు నివారించేందుకు పోలవరం ఎంతో అవసరం. పోలవరం, పట్టిసీమ, గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం కాకపోయి ఉంటే హంద్రీనీవా ద్వారా జిల్లాకు ఎక్కువ నీళ్లు వచ్చేవా? కృష్ణమ్మ పుణ్యమా అని పుష్కలంగా నీటిని తెచ్చి గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి జలాశయాలను నింపామని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అనంతపురంలోని బళ్లారి రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో బుధవారం నిర్వహించిన ధర్మ పోరాట దీక్ష సభలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. అనంతపురం జిల్లా తెదేపాకు కంచుకోట అనీ... 1984లో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇక్కడి ప్రజలంతా రహదారులపైకి వచ్చి ఉద్యమించి, ఎన్టీఆర్ను మళ్లీ సీఎం చేశారన్నారు.
నేను, తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లాకు రుణపడి ఉన్నామని చంద్రబాబు తెలిపారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కుట్రలు కుతంత్రాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అభివృద్ధి చేసే పార్టీనే గెలిపించాలని ప్రజలందరికీ వివరించాలన్నారు. ప్రజలను మెప్పించే బాధ్యత కార్యకర్తలు అంతా తీసుకోవాలన్నారు. నాయకులు వ్యక్తిగత ప్రాబల్యాలకు పోతే నష్టపోతామని చెప్పారు. ఎంత ఉన్నత పదవులు వస్తే, అంత ఒదిగి ఉండాలన్నారు. అంతా సేవాభావంతో పనిచేయాలనీ, నాయకులు... కార్యకర్తలకు అండగా ఉండాలన్నారు. తెదేపా గెలుపు చారిత్రక అవసరమనీ, అంతా విభేదాలు పక్కనపెట్టి పని చేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో రాగద్వేషాలకు అతీతంగా సరైన అభ్యర్థులను నిలుపుతామనీ, జిల్లాలోని 14 శాసనసభ స్థానాలు, 2 ఎంపీ స్థానాలను గెలిపించాలని అధినేత పిలుపునిచ్చారు.