రాష్ట్ర ప్రజల ఆహారపు అలవాట్లు వేగంగా మారుతున్నాయి. ఆరోగ్య పరిరక్షణ పై శ్రద్ధ పెరుగుతూ మధుమేహం, తదితర వ్యాధుల బారి నుంచి ఉపశమనం పొందేందుకు చిరుధాన్యాల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. రోజులో కనీసం ఒకసారైనా చిరుధాన్యాలు తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. మారుతున్న ఆహార అలవాట్లను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా చౌకధరల దుకాణాల ద్వారా రాగులు, తెల్లజొన్న సరఫరా చేస్తోంది. గడచిన మూడు నెలల్లో వీటికి డిమాండ్ పెరగటం ప్రజల ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పునకు అద్దం పడుతోంది. చౌకధరల దుకాణంలో బియ్యం బదులుగా రాగులు లేదా జొన్నలను కిలో రూపాయి చొప్పున తీసుకునే వీలు ప్రభుత్వం కల్పించింది.

ration 2412201 2

రాగులు, జొన్నల పంపిణీని తొలుత రెండేసి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టినప్పటికీ ప్రజల నుంచి పెరిగిన ఆదరణను గమనించి రాష్ట్రం అంతటా అమలు చేస్తున్నారు. రాగుల పంపిణీకి తొలుత 4000 టన్నులు సరఫరా చేసేందుకు ప్రతిపాదించగా, అక్టోబర్‌లో 2215 టన్నుల మేర ఇండెంట్ పెట్టారు. ఆ నెలలో కేవలం 810 టన్నులు మాత్రమే కార్డుదారులు తీసుకెళ్లారు. డిసెంబర్ నాటికి ఇండెంట్ 2262 టన్నులకు చేరుకోగా, 3475 టన్నులు పంపిణీ చేశారు. తెల్లజొన్న కూడా అక్టోబర్‌లో 2640 టన్నుల మేర ఇండెంట్ ఉండగా, 1531 టన్నులను పంపిణీ చేశారు. డిసెంబర్ నాటికి 1561 టన్నులను పంపిణీ చేశారు. దీంతో మూడునెలల్లో 5036 టన్నులను సరఫరా చేయడం విశేషం.

ration 2412201 3

రాగులకు సంబంధించి చిత్తూరు, అనంతపురం, కృష్ణా, కడపలో ఎక్కువ వినియోగం నమోదు కాగా, జొన్నలు కర్నూలులో ఎక్కువగా తీసుకెళ్లినట్లు వివరాలు తెలియచేస్తున్నాయి. జనవరి నుంచి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, ఈమేరకు ఎక్కువ మొత్తంలో రాగులు, జొన్నలను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరా సంస్థ జనరల్ మేనేజర్ వి వెంకటరమణ ఆదివారం ఇక్కడ తెలిపారు. రాగుల వినియోగం రాష్ట్రంలో అంతటా ఉందని, జొన్నలకు ఎక్కువ డిమాండ్ కర్నూలులో మాత్రమే ఉందన్నారు. వీటి సరఫరాపై పరిమితిని ఎత్తివేశామని, బియ్యం బదులు ఎంత కావాలన్నా తీసుకునే వెసులుబాటు కల్పించామని ఆయన వెల్లడించారు.

రాష్ట్రానికి ఏ మోహం పెట్టుకుని ప్రధాని మోడీ వస్తున్నారని, చచ్చారో బతికారో చూద్దామని వస్తున్నారా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రానికి న్యాయం చేశాకే ఇక్కడ పర్యటన చేయాలని, లేని పక్షంలో ప్రజల నుంచి నిరసన ఎదుర్కొనే పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికే ప్రధానికి నిరసన తెలిపేందుకు అన్ని వర్గాలు సమా యత్తమవుతు న్నాయని, తానుకూడా గుంటూరు నుంచి తెనాలివరకు నిరసన పాదయాత్ర ఆరోజు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు సహకరిస్తున్న పార్టీలను సైతం దోషులుగా నిలబెట్టాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నామని, ఇప్పటికే 10 జిల్లాల్లో ధర్మపోరాట సభలు నిర్వహించామని తెలిపారు.

cbnprotest 24122018 2

‘కొత్త సంవత్సరం తొలిరోజు సంబరాలు చేసుకుంటాం.. అయితే వాటి బదులు మనకు జరిగిన అన్యాయంపై గళమెత్తాలి. మన ఐక్యతను చాటాలి. రాష్ట్రస్థాయి నుంచి నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి వరకు నిరసన ప్రదర్శనలు జరగాలి. ప్రతి పల్లెలోనూ జనం కదం తొక్కాలి. ఆ రోజు ఎవరికి ఏ సమయంలో వీలైతే ఆ సమయంలో 2-3 కిలోమీటర్ల మేర నిరసన ర్యాలీలు చేయాలి’ అని సూచించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ, దానికి సహకరిస్తున్న పార్టీల గుండెల్లో గుబులు పుట్టేలా ప్రజల్లో చైతన్యం రావాలని స్పష్టం చేశారు. ఆయనే స్వయంగా ఆ రోజు నిరసన ప్రదర్శనలో పాల్గొనబోతున్నారు. గుంటూరు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల మీదుగా 15-20 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ జరుపుతారని సమాచారం. పార్టీపరంగా అని కాకుండా.. ప్రజలే ముందుకొచ్చి ర్యాలీలు చేయాలని చంద్రబాబు కోరారు.

cbnprotest 24122018 3

‘ఒకరు నడుస్తూ వెళ్తుంటే కలిసొచ్చేవాళ్లు కలిసొస్తూ ఉంటారు. అదో ప్రవాహంలా మారుతుంది. జనాలను రాజకీయంగా తీసుకొచ్చి చేసే పనికాదు. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా స్వచ్ఛందంగా అంతా కలిసిరావాలి. ఎవరికి వీలున్నచోట్ల వారు చేయాలి. ఓ 20 మందీ మొదలుపెడితే.. అలా నిరసన ర్యాలీ సాగుతుండగా మధ్యలో అనేకమంది స్వచ్ఛందంగా కలుస్తారు. చివరకు వెళ్లేసరికి భారీ ర్యాలీగా మారుతుంది. అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకుంటే మళ్లీ అదే చేస్తారు. మోసం చేసినా మౌనంగా ఉంటే బలహీనత అనుకుంటారు. మళ్లీ అదేపని చేస్తారు. మోసం చేసినవాళ్లను నిలదీయాలి. అప్పుడే భయం ఉంటుంది’ అని చంద్రబాబు పార్టీ నేతలు, మీడియాతో వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోసం, ఇతర హామీల అమలు కోసం ఎంత త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారని చెప్పేందుకే నూతన సంవత్సరం మొదటిరోజును ఎంచుకోవాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. సంబరాలు మానుకుని..రాష్ట్రం కోసం ప్రజలు చైతన్యంగా ఉన్నారని నిరూపించే కార్యక్రమంగా ఇది మారాలని ఆకాంక్షిస్తున్నారు. అదే సమయంలో ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఈ నిరసన ఉండాలని స్పష్టం చేస్తున్నారు.

రోడ్డున పడేసిన రాష్ట్రానికి న్యాయం చేస్తాను అంటూ, నమ్మించి మోసం చేసి, తిరుమల వెంకన్న పాదాల చెంత హామీలు ఇచ్చి, ఏపి ప్రజలను గాలికి వదిలేసి, మన రాష్ట్రానికి చేసిన అన్యాయం ఖరీదు, అక్షరాలా రూ.90,283 కోట్లు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో రాజ్యసభలో ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన హామీల మేరకు ఈ మొత్తం నిధులు విడుదల చేయాల్సి ఉందని తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం శ్వేతపత్రం విడుదల చేశారు. ‘పునర్విభజన చట్టంలో 14 విభాగాలుగా హామీలు ఇవ్వగా.. అందులో 9 అమలుచేయలేదు. ఐదింటిని పాక్షికంగా అమలుచేశారు. పార్లమెంటు వేదికగా అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో.. ప్రత్యేక హోదా, పన్ను ప్రోత్సాహకాలు, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, పోలవరం, సిబ్బంది, ఆస్తులూ అప్పులూ పంపిణీ, వనరుల అంతరం భర్తీపై ఆరు హామీలిచ్చారు. అందులో ప్రత్యేక హోదాకు అతీగతీ లేదు. మిగతా ఐదూ పాక్షికంగా అమలు చేశారు’ అని అందులో పేర్కొన్నారు.

modi topi 24122018 2

హామీలు, చట్టంలోని అంశాలు, ప్రతిపాదనల ప్రకారం వనరుల లోటుగా రూ. 12,099.26 కోట్లు, కొత్త రాజధాని నిర్మాణానికి రూ. 38,437 కోట్లు, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీగా రూ. 23,300 కోట్లు, ప్రత్యేక కేటగిరీ హోదా కింద ఐదేళ్లకు 60శాతానికి బదులు 90శాతం వాటాలో వ్యత్యాసం రూ. 16,447 కోట్లు వెరసి రూ. 90,283.26 కోట్లు కేంద్రం విడుదల చేయలేదు. ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ నాయకులు, అధికారులు, ఉద్యోగుల కఠోర శ్రమ, ప్రజల భాగస్వామ్యంతో నాలుగున్నరేళ్లలో రాష్ట్రం ప్రగతి సాధించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి 54 కీలక కేంద్ర ప్రతిపాదిత, కేంద్ర రంగ పథకాలలో ఏపీ పనితీరు ఈ ఏడాది నవంబర్ వరకు 14 పథకాల్లో మొదటి ర్యాంక్, మరో 28 పథకాల అమలులో 2 నుండి 5 ర్యాంకులు, 4 పథకాల్లో 6 నుండి 10 ర్యాంకులు సాధించినట్టు శే్వతపత్రంలో వివరించారు.

modi topi 24122018 3

విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలో ఉన్న సంస్థ ఆస్తుల విలువ రూ.1,97,280 కోట్లు. కేంద్రం నిర్లక్ష్యం కారణంగా ఈ సంస్థల ఆస్తులు, అప్పులను విభజించలేదు. పదో షెడ్యూల్లో 142 సంస్థలు ఉండగా వాటినీ విభజించలేదదు. వీటి ఆస్తుల విలువ రూ.38,772.85 కోట్లు. రాష్ట్రానికి వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు 2013 నాటి చట్టం ప్రకారం భూసేకరణ, సహాయ, పునరావాస కార్యక్రమాలతో పాటు పెరిగిన అంచనాలకు అనుగుణంగా రూ.57,940.86 కోట్లకు సవరించిన అంచనాలను కేంద్రానికి సమర్పించాం. ఇప్పటివరకు ఆమోదించలేదు. రాష్ట్రప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3,342.4 కోట్లను ఇంకా రీయింబర్స్‌ చేయలేదు. ఏపీ జెన్‌కోకు తెలంగాణ డిస్కంలు రూ.5,732.4 కోట్ల బకాయిలున్నాయి. 2014 నాటికి ఉన్న ఈ బకాయిల వసూళ్లపై కేంద్రం ఇప్పటివరకు పరిష్కరించలేదు. గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటు, అసెంబ్లీ సీట్ల పెంపు, ఢిల్లీ ఏపీభవన్‌ ఆస్తుల విభజన, పన్ను బకాయులు, రుణాలు, రీఫండ్‌ల కేటాయింపు కూడా చేయలేదు.

నవ్యాంధ్ర చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించబోతున్న శుభ గడియలు సమీపించాయి. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం జాతీయ ప్రాజెక్టుకు మొదటి గేటును బిగించే పనికి శుభముహూర్తం ఖరారైంది. నవ్యాంధ్రుల జీవనాడిగా, వర ప్రదాయనిగా పేరుగాంచిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అత్యంత కీలక ఘట్టానికి సోమవారం శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే 61.43 శాతం పనులు పూర్తి చేసుకుని శరవేగంగా నిర్మాణం జరుగుతున్న ఈ ప్రాజెక్టులో ముఖ్యమైన రేడియల్ గేట్ల ఏర్పాటు పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. 48 రేడియల్ గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, అందులో తొలి గేటు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం తొలి గేటును నిలబెట్టే కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులమీదుగా ప్రారంభించనున్నారు.

polavaram 24122018 2

మిగిలిన 47గేట్లు వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో గేటు ఎత్తు 20.83 మీటర్లు, వెడల్పు 15.9 అడుగులు. మొత్తం గేట్ల తయారీకి 18వేల టన్నుల ఉక్కు అవసరమవుతుందని అంచనా. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు 61.98 శాతం పూర్తయ్యాయి. గేట్ల నిర్మాణానికి రూ. 530కోట్ల రూపాయలు వ్యయం అవుతోంది. గేట్లను నిలబెట్టేందుకు హైడ్రాలిక్ సిలిండర్లు వినియోగిస్తారు. ఒక్కో సిలిండర్ బరువు 250 టన్నులు కాగా, వీటిని జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. గేట్ల ఏర్పాటులో హైడ్రాలిక్ సిలిండర్లతో పాటు సెల్ఫ్ లూబ్రికేటింగ్ బుష్‌లు కీలకంగా ఉంటాయి. వీటిని జపాన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. మొత్తం 96 బుష్‌లు అవసరం అవుతాయి.

polavaram 24122018 3

ఒక్కో హైడ్రాలిక్ సిలిండర్ 500 టన్నుల బరువును ఎత్తుతుంది. ఒక్కో గేటు 300 టన్నుల బరువు ఉంటుంది. గేట్‌ను ఎత్తి నిలబెట్టేందుకు వీలుగా ఇప్పటికే కొన్ని హైడ్రాలిక్ సిలిండర్లు ప్రాజెక్టు ప్రాంతానికి తరలించగా, మరికొన్ని కొద్దిరోజుల్లో రానున్నాయి. తొలిగేటును ఏర్పాటు చేయడం ద్వారా ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రాజెక్టను మే చివరి నాటికి పూర్తిచేసి గ్రావిటీ ద్వారా నీటిని అందించాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రాజెక్టు ఎత్తు 129 అడుగులు, పొడవు 9560 అడుగులు ఉంటుంది. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సహా సాగు, మంచినీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మిస్తోంది.

Advertisements

Latest Articles

Most Read