తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదేదో అంటున్నారని.. తన జీవితంలో భయమనేదే లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గురువారం ఆయన విశాఖ జిల్లాలోని తగరపువలసలో చిట్టివలస జ్యూట్‌మిల్లు మైదానంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సదస్సులో మాట్లాడారు. కొందరు విభేదాలు ఉంటే గానీ ప్రాబల్యం ఉండదని చూస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో ఇటీవల ఎన్నికల ప్రచారం చేశానని, ప్రచారానికి వెళ్తే.. అక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు బర్త్‌డే గిఫ్ట్ ఇస్తామంటున్నారని అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలకు తాను భయపడనని చంద్రబాబు స్పష్టంచేశారు.
ధనిక రాష్ట్రాల కంటే మిన్నగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక హోదా ఇస్తే పవన్, జగన్‌కు ఇబ్బందేంటి? అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తున్న తెరాసను జగన్, పవన్ కల్యాణ్ సమర్థిస్తున్నారని ఆక్షేపించారు. ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, అప్పుడు కేసీఆర్ హోదా ఇవ్వాలన్నారని, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. హోదాను వ్యతిరేకించిన టీఆర్ఎస్ను జగన్, పవన్ సమర్థిస్తున్నారని సీఎం మండిపడ్డారు. లాలూచీ రాజకీయాలు చేసినవారు చరిత్ర హీనులుగా మిగిలారని వ్యాఖ్యానించారు. దేశంలో అవినీతి లేని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పవన్, జగన్, కేసీఆర్‌ను మనపై ఎగదోస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఒక్కడినే పోరాడితే ఉపయోగం లేదనే అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. మంచో చెడో విభజన జరిగి ఆదాయం తెలంగాణకు వెళ్లిందన్నారు. అయినా ఏపీని అభివృద్ధి చేసే శక్తిని దేవుడు తనకిచ్చారని వ్యాఖ్యానించారు. కేసుల మాఫీ కోసం వైకాపా రాష్ట్రాన్ని తాకట్టు పెడుతోందని.. జగన్, పవన్, కేసీఆర్‌లను ప్రధాని మోదీ తమపైకి ఎగదోస్తున్నారని ఆరోపించారు. కేంద్రం సహకరిస్తే గుజరాత్‌ను మించి అభివృద్ధి చెందుతామని మోదీకి భయం పట్టుకుందని చంద్రబాబు విమర్శించారు. కేసీఆర్ ఫొటోలు పట్టుకుని ప్రతిపక్ష నేతలు ఊరేగుతున్నారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.