భాజపా చేసిన నమ్మకద్రోహానికి ఈ గడ్డపై పుట్టిన వారెవ్వరూ ఆ పార్టీకి మద్దతు ఇవ్వబోరని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్రం చేస్తోంది మంచి పనా లేదా చెడ్డదా? అన్నది రాష్ట్రంలోని భాజపా నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడతారా? లేదా భాజపాకు ఊడిగం చేస్తారా? తేల్చుకోవాలి. మనస్సాక్షి ప్రకారం నడుచుకోవాలి’ అని హితవు పలికారు. మధ్యంతర ఎన్నికలకు ఎందుకు వెళ్లారో తెలంగాణ సీఎం కేసీఆర్‌కే తెలియదని ఎద్దేవా చేశారు. బంగారుబాతులాంటి హైదరాబాద్‌ను అప్పగిస్తే సరిగ్గా సాకకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. విజయనగరం జిల్లాకు చెందిన భాజపా, వైకాపా నేతలు కొందరు శుక్రవారం ఉండవల్లిలో సీఎం చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ...‘బెదిరింపులకు ఎన్నడూ భయపడలేదు. కేసీఆర్, జగన్, పవన్‌కల్యాణ్ భాజపాకు మేలు చేసేందుకే నన్ను విమర్శిస్తున్నారు. అవినీతి రహిత రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉంటే అవినీతి అంటూ పవన్ విమర్శించడం విడ్డూరం. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.70 వేల కోట్లు రావాలన్నారు. అవిశ్వాసం పెడితే మద్దతిస్తానని అన్నారు.. ఏమైంది? కేంద్రాన్ని ఇప్పుడెందుకు అడగడం లేదు? అవిశ్వాసం పెడితే కనిపించకుండా పోయారు’ అని విమర్శించారు. ‘తిత్లీ తుపానుతో శ్రీకాకుళం జిల్లా అస్తవ్యస్తమయితే ప్రతిపక్ష నేత జగన్ కనీసం పరామర్శించలేదు. రాష్ట్రం, ప్రజల పట్ల కనీస బాధ్యత లేని పార్టీ వైకాపా. కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయాలని, ఎన్డీయే నుంచి బయటకు రావాలని.. కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని అన్నారు. అన్నీ చేశాక గోదా వదిలేసి పరారయ్యారు. లోక్‌సభలో తెదేపా అవిశ్వాసానికి 15 పార్టీలకు చెందిన 126 మంది ఎంపీలు మద్దతిస్తే వైకాపా ఎంపీలు పత్తా లేకుండా పోయారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతోనే తెదేపా పనిచేస్తుంది’ అని సీఎం స్పష్టం చేశారు.
‘కేంద్రంలోని బీజేపీ నేతలు నవ్యాంధ్రకు తీరని ద్రోహం చేశారు. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి బీజేపీ ఓట్లు వేయించుకుంది. గెలిచాక అసలే ఇవ్వకుండా మోసం చేసింది. కేంద్రంపై పోరాడుతున్న టీడీపీకి పార్టీలకతీతంగా అందరూ అండగా నిలవాలి. ఈ గడ్డపై పుట్టినవారెవరూ బీజేపీకి మద్దతివ్వరు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడతారా.. కేంద్రంలో బీజేపీ నేతలకు ఊడిగం చేస్తారా? రాష్ట్ర బీజేపీ నేతలే తేల్చుకోవాలి. మోదీ ప్రభుత్వం చేసేది మంచిదో చెడ్డదో ప్రశ్నించుకోవాలి. మనస్సాక్షి ప్రకారం నడుచుకోవాలి’ అని సూచించారు. రాజకీయాలు ప్రజల కోసం చేయాలని.. స్వార్థం కోసం కాదని చెప్పారు.