ఒక పక్క కేంద్ర సహకారం లేదు.. మరో పక్క కొత్త రాష్ట్రం.. ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నా, రాష్ట్ర శ్రేయస్సు పై మాత్రం ఎక్కడా రాజీ లేకుండా, ప్రజలకు ఏది కావాలో అది చేసి చూపిస్తున్నారు చంద్రబాబు. కేంద్రం చెయ్యాల్సిన పని, వారు చెయ్యకపోవటంతో, ఒకే రోజు రెండు ప్రాజెక్ట్ లకు, రాష్ట్ర ప్రభుత్వం తరుపున చెయ్యటానికి ఒకే చేసారు. కేంద్రం నాన్చుడు ధోరణిపై ఆగ్రహంతో రగిలిపోతున్న రాష్ట్రప్రభుత్వం కడపలో ఉక్కు కర్మాగారాన్ని సొంతంగా చేపట్టబోతోంది. అలాగే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టునూ సొంత వనరులతో పూర్తిచేయనుంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. కడప జిల్లాలో 100 శాతం సొంత పెట్టుబడి వ్యయంతో వచ్చే నెలలోనే ప్రతిష్ఠాత్మక ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయాలని నిశ్చయించింది.
ఈ మేరకు రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది.ఆ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, చేసిన చర్చలను సమాచార, పౌరసంబంధాల మంత్రి కాల్వ శ్రీనివాసులు అనంతరం విలేకరులకు వెల్లడించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ఎండీగా పనిచేసి రిటైరైన పి.మధుసూదన్‌ను రాయలసీమ స్టీల్ కార్పొరేషన్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు విషయంలో అవసరమైతే ఈక్విటీకి వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెప్పారు. అయితే చివరి ప్రయత్నంగా కేంద్రానికి మరో అవకాశం ఇవ్వాలని మంత్రివర్గం భావించిందని, ఇదే అంశంపై మూడు ప్రతిపాదనలతో కేంద్రానికి త్వరలో లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
మరో పక్క, విశాఖ మెట్రో రైలుకు అనుమతి లభించింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయించింది. విభజన చట్టం హామీల్లో భాగంగా విశాఖకు మెట్రో రైలు బాధ్యత కేంద్రానిదే అయినా అక్కడి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)లో చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రివర్గం కూడా మంగళవారం ఆమోదించింది. దీంతో భారతదేశంలో పీపీపీలో నిర్మించే అతిపెద్ద రెండో మెట్రోగా విశాఖ ప్రాజెక్టు గుర్తింపు పొందింది. దీనికి ఇప్పటికే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌పీఎ్‌ఫ)ను ఆహ్వానించడంతో ఆ ప్రకారం ముందుకువెళ్లాలని సూచించింది. విశాఖపట్నంలో కొమ్మాది నుంచి గాజువాక వరకు మూడు కారిడార్లుగా విభజించి మొత్తం 42.55 కి.మీ. పొడవున మెట్రో రైల్వే ట్రాక్ నిర్మిస్తారు. వీటికి అవసరమైన చోట స్టేషన్లు, రన్నింగ్ సెక్షన్, పార్కింగ్ సదుపాయాలు, డిపోల ఏర్పాటుకు అవసరమైన 83 ఎకరాల భూమిని ప్రభుత్వం సమకూరుస్తుంది. మరో 12 ఎకరాలను సేకరించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.