విశాఖపట్నం విమానాశ్రయంలో తనపై జరిగిన దాడికి సంబంధించి వాంగ్మూలం ఇచ్చేందుకు విపక్షనేత జగన్ నిరాకరించారు. ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని తెలిపారు. సిట్‌కు నేతృత్వం వహిస్తున్న విశాఖ నార్త్ ఏసీపీ బి.నాగేశ్వరరావు, సీఐ కె.లక్ష్మణమూర్తి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లో జగన్ చికిత్స పొందుతున్న సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రికి చేరుకున్నారు. తాము వచ్చిన సమాచారాన్ని జగన్‌కు తెలియచేయాలని అక్కడున్న వైసీపీ నేతలను కోరారు. సుమారు గంట తర్వాత జగన్ నుంచి సిట్ అధికారులకు పిలుపు వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.... ఇద్దరు అధికారులు జగన్ వద్దకు వెళ్లి తమను పరిచయం చేసుకున్నారు. ఈ ఘటనపై వాంగ్మూలం ఇవ్వాలని కోరారు. అందుకు జగన్ నిరాకరించారు.‘
ఏపీ పోలీసులపై మాకు నమ్మకం లేదు. విచారణ బాధ్యతలను మరేదైనా రాష్ట్ర పోలీసులకు లేదా ఏదైనా దర్యాప్తు ఏజెన్సీకి అప్పగించాలి’ అంటూ తన వైఖరిని స్పష్టం చేశారు. సంఘటన వివరాలు చెప్పాలంటూ 160 సీఆర్పీసీ కింద ఇచ్చిన నోటీసును స్వీకరించేందుకు కూడా నిరాకరించారు. ఇదే విషయాన్ని జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి నోటీసు ప్రతిపై రాసిచ్చారు. ‘‘ప్రచారం కోసం జగన్ అభిమానే దాడి చేసినట్లు స్వయంగా డీజీపీ, చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ నోటీసును తీసుకోవడంలేదు. అలాగే... వారి నేతృత్వంలో పోలీసు శాఖ నిర్వహిస్తున్న దర్యాప్తు తీరు తెన్నులపైనా మాకు నమ్మకం లేదు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి రాసిచ్చారు.
జగన్ తనపై జరిగిన దాడికి సంబంధించి రాష్ట్ర పోలీసులకు వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించినందున ఈ వ్యవహారంలో న్యాయపరంగా ఎలా నడుచుకోవాలన్న అంశంపై ముఖ్యమంత్రి కలెక్టర్ల సదస్సు ముగిశాక కొందరు మంత్రులు, న్యాయనిపుణులతో చర్చించారు. జగన్ వాంగ్మూలం ఇవ్వకపోతే దర్యాప్తు చేయడం కష్టం కాబట్టి కోర్టులో 164 నిబంధన కింద పిటిషన్ వేయాలని నిర్ణయించారు. సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. వైకాపా నాయకులు చేసిన తప్పులు తిరిగివారికే తగులుతున్నాయని వ్యాఖ్యానించారు. జగన్‌పై దాడి జరిగిన వెంటనే డీజీపీ మీడియాతో మాట్లాడటాన్ని వైకాపా నాయకులు తప్పుపట్టడం చర్చకు వచ్చింది. డీజీపీ చేసిన దాంట్లో తప్పులేదని, మీడియా ప్రతినిధులు వివరాలు కోరడంతో అప్పటికి ఆయనకు తెలిసిన సమాచారం చెప్పారని సీఎం వ్యాఖ్యానించారు.