తెలంగాణలో టిడిపి ర్టీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళాలని, కాంగ్రెస్తో కలిసి వెళ్ళవద్దని, తెలంగాణ ముఖయంత్రి కేసీఆర్ తనను కోరారని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం అమరావతిలో జరిగిన టీడీపీ ఎంపీల సమావేశంలో, టీఆర్ఎస్ పార్టీతో జరిగిన చర్చల వివరాలను చంద్రబాబు వివరించారు. తెలుగు రాష్ట్రాలు కలిసి పని చేద్దామని కెసిఆర్ కు చెప్పిన, విషయాన్ని టీడీపీ పార్లమెంటరి సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించారు. రాజకీయంగా ఆంధ్రా -తెలంగాణా రాష్ట్రాలు కలిసి ఉంటే దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాలదే పైచేయి అవుతుందని, ఢిల్లీలో పట్టు పెరుగుతుందనే విషయాన్ని కేసీఆరుకు వివరించానని చంద్రబాబు అన్నారు. ఈ విషయం పై ఆలోచించి చెబుతానన్న కేసీఆర్, వారం రోజుల తర్వాత మీతో కలిసి రావటం కుదరదని చెప్పారని చంద్రబాబు వెల్లడించారు.
ఇదే సమయంలో, తెలంగాణలో పోటి చేస్తే టిడిపి ఒంటరిగా పోటి చేయించాలని, కాంగ్రెస్తో పొత్తు వద్దని కేసీఆర్ చెప్పారని, దీంతో నాకు అప్పటికే కెసిఆర్ వేరేవాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయాడని అర్ధం అయ్యిందని చంద్రబాబు అన్నారు. 2014లో ఎన్నికల ముందే ఏపీలో జగన్, తెలంగాణలో టీఆర్ఎస్ వస్తుందని కేసీఆర్ చెప్పారన్నారు. దీనిని బట్టి అర్థమైంది ఏంటంటే, ఏపీలో జగన్ వస్తే తానే సమర్ధుడిగా చలామణి కావొచ్చని కేసీఆర్ ఆశించారన్నారు. కానీ ఏపీ ప్రజలు కేసీఆర్ ఆశలను తారుమారు చేశారన్నారు. చారిత్రక కారణాల వల్లే తెలంగాణలో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు స్పష్టం చేసారు. చంద్రబాబును ఉద్దేశించి కేసీఆర్ చేస్తున్న విమర్శలు, వాడుతున్న భాష ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.
చేసిన అభివృద్ధిని చెప్పుకొని ప్రజల వద్ద ఓట్లు పొందగలిగే పరిస్థితిలో కేసీఆర్ లేరని, అందుకే ఆంధ్రులను, చంద్రబాబును తిట్టి మరోసారి తెలంగాణ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొడితే తప్ప గెలవలేనన్న అభిప్రాయంతో ఈ పని చేస్తున్నారని టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. ‘ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా మెదక్ జిల్లా రాజకీయాల్లో కరణం రామచంద్రరావుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. కేసీఆర్ను పట్టించుకొనే వారు కాదు. నేను కేసీఆర్కు ప్రాధాన్యం ఇచ్చి ముందుకు తెచ్చాను. నా కేబినెట్లో మంత్రిగా అవకాశం ఇచ్చాను. ఆయన నా కింద పనిచేశారు. అయినా నేను ఎప్పుడూ కేసీఆర్ను ఆ దృష్టితో చూడలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడూ ఇచ్చాను. ఆయనను నా సహచరుడిగా (కొలీగ్)గా సంబోధించేవాడిని తప్ప తక్కువగా చూడలేదు. కేసీఆర్ ఎలా ఉన్నా... ఎలా మాట్లాడినా నా హుందాతనం నేను నిలుపుకొన్నాను. ఆయన మాట్లాడే భాషను ప్రజలు సమర్ధిస్తారని నేను అనుకోను’ అని చంద్రబాబు అన్నారు.