అమిత్ షా నుంచి వచ్చిన ఆదేశాలు, బీజేపీ పార్టీతో ఉన్న అవగాహన కోసం, జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న త్యాగాలు అన్నీ ఇన్నీ కావు... జగన్ పార్టీలో చేరటానికి రెడీ అయిన కన్నా లక్ష్మీ నారాయణని, అమిత్ షా ఆదేశాల ప్రకారం రాత్రికి రాత్రి హాస్పిటల్ లో చేరి, తెల్లారే సరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. ఇప్పుడు, ఈ కన్నా లక్ష్మీ నారాయణను వచ్చే ఎన్నికల్లో గెలిపించటానికి, సొంత పార్టీలో నమ్మిన బంటుకు హ్యాండ్ ఇచ్చాడు. ఇదంతా అమిత్ షా ఆదేశాల ప్రకారమే. ఈ వ్యవహారానికి మూల కారణం గుంటూరు వెస్ట్ సీట్. ముఖ్యంగా గుంటూరు నగరంలో తొలి నుంచి వీర విధేయునిగా వ్యవహరిస్తూ 24 గంటలూ పార్టీ కోసమే పరితపించే నగర పార్టీ అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డికి టిక్కెట్ ఇవ్వటం లేదని ఆ పార్టీ అధినేత తేల్చి చెప్పేశారు.
గత ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన అప్పిరెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేయటంతో ఆయనకున్న వ్యక్తిగత ఇమేజ్‌తో వైసీపీకి పడాల్సిన 20 వేలకు పైగా ఓట్లను చీల్చుకోవటంతో అప్పిరెడ్డి రెండోస్థానంలో నిలవాల్సి వచ్చింది. ఓటమి అనంతరం కూడా అప్పిరెడ్డినే నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగించారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో నిత్యం ప్రజలతో మమేకమై పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. వాస్తవానికి గత ఎన్నికల్లో కంటే ఇప్పుడు నియోజకవర్గంలో వ్యక్తిగతంగా బలం పుంజుకున్నాడని ఆ పార్టీ శ్రేణులే ఒప్పుకుంటున్నాయి.
ఇటువంటి పరిస్థితుల్లో రాత్రికి రాత్రి పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జిగా మాజీ డీఐజీ చంద్రగిరి ఏసురత్నాన్ని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అప్పిరెడ్డి లాంటి నేతను కాకుండా, బలహీన అభ్యర్ధి ఏసురత్నంను నియమించటం వెనుక, కన్నా లక్ష్మీ నారయణను గెలిపించే ఎత్తుగడ ఉంది. బీజేపీ, వైసిపీ కలిసి కన్నా లక్ష్మీ నారాయణను గెలిపించే ప్రయత్నంలో భాగంగా జగన్ ఈ ప్లాన్ వేసారు. ఇదంతా అమిత్ షా ఆదేశాల ప్రకారమే జరుగుతుంది. ఇది ఒక్కటే కాదు, రాష్ట్రంలో మరిన్ని సీట్లు, జగన్, పవన్ తో ఇలాంటి అవగాహనే చేసుకుని, చంద్రబాబును ఓడించే ప్రయత్నం చెయ్యనున్నారు. అప్పిరెడ్డి అభిమానులు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేసినా, తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఎదురైనా, జగన్ మాత్రం నా చేతుల్లో ఏమి లేదని తేల్చి చెప్పేశారు.