అమెరికా పర్యటనను ముగించుకుని విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకున్న . తెల్లవారు జాము నాలుగున్నరకు గన్నవరం చేరుకున్న సీఎం చంద్రబాబు బృందం. గన్నవరం విమానాశ్రయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుగుదేశం శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అయితే చంద్రబాబు వెంటనే అరకు పర్యటనకు బయలుదేరారు. ఇవి పర్యటన వివరాలు.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు విశాఖ మన్యంలో పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం అరకుకు చేరుకోనున్న సీఎం.. మావోయిస్టుల చేతిలో హతమైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
సీఎం పర్యటన దృష్ట్యా పోలీసు ఉన్నతాధికారులు అరకులోయ, పాడేరులో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఏఎస్పీ ఐశ్వర్యరస్తోగి గురువారం సాయంత్రం అరకులోయలోని హెలిప్యాడ్‌ను పరిశీలించి భద్రత ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సోమ ఇంటి పరిసరాలను పరిశీలించి ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వచ్చే సమయంలో పరిమిత సంఖ్యలోనే పార్టీ నాయకులను అనుమతించేలా చూడాలని సోమ కుటుంబసభ్యులకు సూచించారు. కిడారి, సోమ మావోయిస్టుల చేతుల్లో హత్యకు గురైన రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటనలో ఉన్నారు.
అమెరికా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వస్తారన్న సమాచారంతో పాడేరు సమీపంలోని అడారిమెట్ట వద్ద హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. అమరావతి నుంచి విశాఖ విమానంలో చేరుకోనున్న సీఎం.. అక్కడి నుంచి హెలికాప్టర్లో పాడేరు చేరుకుని కిడారి కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు. అక్కడి అరకులోయ వెళ్లి సోమ కుటుంబాన్ని పరామర్శిస్తారు. సీఎం పర్యటన తొలుత 29వ తేదీ ఉంటుందని జిల్లా యంత్రాంగానికి సమాచారం వచ్చింది. చివరి నిమిషంలో మార్పు జరిగి శుక్రవారమే విశాఖకు రానున్నట్లు సమాచారం అందడంతో హుటాహుటిన ఏర్పాట్లు చేశారు.