నిన్నటి మీటింగ్ తరువాత, ఈ రోజు కూడా పవన్ బాగా ఆవేదనతో ఊగిపోయారు. అంతే కాదు, ఈ రోజు మరో కొత్త విషయం చెప్పారు.. పశ్చిమగోదావరి జిల్లా ప్రజాపోరాట యాత్రలో భాగంగా ఆయన గురువారం ఉంగుటూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గుంటూ ఈ వ్యాఖ్యలు చేసారు. ‘కొంతమంది నాయకులు నన్ను చంపేస్తే అసలు సమస్య ఉండదు కదా అని మాట్లాడుకున్న వాయిస్ క్లిప్ నాదాక వచ్చింది, అది ఎవరో కూడా తెలుసు, నన్ను చంపేసి అధికార, ప్రతిపక్షాలు ఒకరిమీద ఒకరు తోసుకుని అడ్డు తొలగించుకోవాలని, భయపెట్టాలని చూస్తున్నారు' అని పవన్ కళ్యాణ్ అన్నారు.
అంతే కాదు, పవన్ కళ్యాణ్ రాత్రిళ్ళు ఏమి చేస్తారో కూడా చెప్పారు. "ఈ సో కాల్డ్ ఎంఎల్ఏలు రౌడీజం చేస్తూ, రోజు క్లబ్బుల్లో తాగి, తందనాలాడి కాళ్ళు బారా చాపి కూర్చుంటే... నేను మాత్రం రాత్రుళ్లు కూర్చొని సమాజం గురించి ఎన్నో పుస్తకాలు చదివి, సమాజాన్ని అధ్యాయనం చేసి వచ్చిన వాణ్ణి' అని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు విని జన సైనికులు ఉప్పొంగిపోతున్నారు. మేము కూడా రాత్రిళ్ళు పడుకోకుండా, సమాజం గురించి ఎన్నో పుస్తకాలు చదివి, సమాజాన్ని అధ్యాయనం చేస్తామని అంటున్నారు.
అసలు మరో గొప్ప విషయం కూడా పవన్ చెప్పారు. ఈ విషయం వింటే నరేంద్ర మోడీ, రాహుల్ గాంధి, మమతా బెనర్జీ కూడా భయపడి పోతారు.. ఇంతకీ పవన్ ఏమన్నాడో చూడండి.. 'పవన్ కళ్యాణ్ సీఎం.. పవన్ కళ్యాణ్ సీఎం' అని అభిమానులు నినాదాలు చేయడం పై ఆయన స్పందిస్తూ.. 'అసలు నేను ముఖ్యమంత్రే అవుతానని ఎందుకనుకుంటున్నారు? అంత కంటే ఎక్కువే అవుతాను" అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మొత్తానికి రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే, ఈయన ఎంత మహా జ్ఞానో అర్ధమవుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, పాపం ఇతని తపన ఆలకిస్తారని ఆశిద్దాం..