విభజన హామీలు నెరవేర్చలేదు అని, తెలుగుదేశంపార్టీ ఎన్టీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ, తెలుగుదేశం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉంది. బీజేపీ నేతలు రాష్ట్రంలో చంద్రబాబు పై కత్తులు నూరుతున్నారు. అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో బీజేపీ శాసనసభాపక్ష నేతల విష్ణుకుమార్‌రాజు ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలో చిచ్చురేపాయి.. పోలవరం గ్యాలరీ వాక్కు వెళ్లిన విష్ణుకుమార్‌రాజు అక్కడ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరును పరిశీలించారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులు మంచివని, పట్టిసీమ లేని పక్షంలో కృష్ణా డెల్టా ఎడారిగా మారిపోయేదని, చంద్రబాబు చేసిన ప్రయత్నం వల్ల కృష్ణా డెల్టాలో మూడేళ్లుగా పంట చేతికందుతుందని వ్యాఖ్యానించారు. చంద్రన్న బీమా, అన్న క్యాంటీన్ల పధకాలు కూడా అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు.
ప్రత్యేకహోదా.. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానంపై విష్ణుకుమార్‌రాజు కొన్ని అభ్యంతరాలను లేవనెత్తినప్పటికీ, ముఖ్యమంత్రి సూచనతో తీర్మానాన్ని బలపరిచారు విష్ణుకుమార్‌రాజు. పలు సందర్భాలలో ముఖ్యమంత్రిని విష్ణుకుమార్ రాజు ప్రశంసించడం బీజేపీ నేతలకు సుతారమూ నచ్చలేదు. తామంతా ప్రభుత్వ పని తీరును తప్పుబడుతుంటే విష్ణుకుమార్ రాజు శాసనసభలో అందరి సాక్షిగా ముఖ్యమంత్రిని పొగడటం పట్ల వారు హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తున్నారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో 'నరేగా' నిధులు వినియోగంపై కూడా రాష్ట్రానికి అనేక అవార్డులు వచ్చాయని, దేశంలో ఆంధ్రప్రదేశ్ ఈ నిధుల వినియోగంలో అగ్రగామిగా ఉందని లోకేష్ చెప్పగా, కేంద్ర ప్రభుత్వం నిధుల వల్లే రాష్ట్రానికి ఈ పేరు వచ్చిందని, అందువల్ల ప్రధాని ఫోటోను కూడా పత్రికా ప్రకటనల్లో వేయాలని మాజీ మంత్రి మాణిక్యాలరావు సూచించారు. యువకుడిగా ఉన్న లోకేష్ అద్భుతంగా పని చేస్తున్నారని కొనియాడారు.
ఇలా బీజేపీ నేతలు విష్ణుకుమార్ రాజు, మాజీ మంత్రి మాణిక్యాలరావులు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ను ప్రశంసించడం, బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వీరిరువుర్నీ పిలిపించి మాట్లాడాలని నిర్ణయించారు. అయితే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.. 'అసెంబ్లీలో మీ నేతలేమో ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు.. మీరేమో తిట్టిపోస్తున్నారు' అని విలేకరులు అడగడంతో ఆయన కొంచెం ఇబ్బంది పడ్డారు. ఆయన దృష్టి కోణం అలా ఉందంటూ విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యలను తిప్పికొట్టారాయన! బీజేపీ అగ్రనేతలు కొందరు ఈ విషయాన్ని హైకమాండ్‌కు చెప్పినట్టు తెలిసింది.. విష్ణుకుమార్‌రాజు ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉంటున్నారు.. పైగా ఆర్ఎస్ఎస్తో మంచి సంబంధాలున్నాయి.. ఈ కారణంగానే ఆయన జోలికి ఎవరూ వెళ్లడం లేదు.. హైకమాండ్ మాత్రం సంయమనం పాటించాలని నేతలకు సూచించింది..