రాష్ట్రంలో సముద్ర సంబంధిత పరిశోధన-అభివృద్ధి విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ రంగంలో అంతర్జాతీయంగా పేరొందిన ‘డోయెర్’ ముందుకొచ్చింది. రెండోరోజు తన అమెరికా పర్యటనలో భాగంగా తొలుత డోయెర్ (డీప్ ఓషన్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్) సంస్థ ముఖ్య కార్యనిర్వాహక అధికారి లిజ్ టేలర్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుదీర్ఘ కోస్తాతీరం గల ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై ఆమెతో కూలంకుశంగా చర్చించారు. సముద్ర సంబంధిత సాంకేతిక పరిశోధనలపై శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు శిక్షణ అందించడానికి ఆరంభంలో రూ.200 కోట్లు వెచ్చించడానికి సిద్దంగా వున్నట్టు డోయెర్ సీఈవో లిజ్ టేలర్ ప్రకటించారు. ఏపీని సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల ముఖ్య స్థావరంగా తీర్చిదిద్దడానికి డోయెర్ సహకారిస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి హామీఇచ్చారు.
తూర్పుతీరంలో వ్యూహాత్మక వాణిజ్య స్థావరంగా వున్న ఆంధ్రప్రదేశ్‌లో తమ సంస్థ వ్యాపార, పరిశోధన కార్యకలపాలను ఆరంభించడానికి సంసిద్ధంగా వున్నట్టు తెలిపారు. ఏపీ నుంచి అనేక దేశీయ సంస్థలకు సముద్ర సంబంధిత సేవలను అందించడానికి ఆసక్తిని కనబరచారు. ఏపీలో 974 కిలోమీటర్ల మేర గల కోస్తాతీరంలో అపార వాణిజ్య, వ్యాపార, పరిశోధనలకు పుష్కలంగా అవకాశాలు వున్నాయని ముఖ్యమంత్రి తొలుత డోయెర్ సీఈవోకు వివరించారు. సముద్ర పరిశోధనా రంగంలో డోయెర్ అభివృద్ధి చేసిన శాస్త్ర సాంకేతికతను ఏపీకి అందించడం ద్వారా ఉభయులూ కలిసి అద్భుతాలు సృష్టించవచ్చునని అభిప్రాయపడ్డారు. దేశంలో సుదీర్ఘ తీరప్రాంతంగా వున్న ఏపీలో ప్రస్తుతం నౌకాశ్రయ అభివృద్ధి కార్యకలాపాలపై దృష్టి నిలిపామని చెప్పారు. ఏపీలో ఆక్వా రంగ అభివృద్ధిలో భాగస్వామ్యం తీసుకోవడానికి వెంటనే ఒక బృందాన్ని పంపించాలని ముఖ్యమంత్రి సూచించారు.
1992లో ప్రఖ్యాత ఓషనోగ్రాఫర్, సముద్ర జీవ శాస్త్రవేత్త డాక్టర్ సిల్వియా ఈరీ నెలకొల్పిన డోయెర్ సంస్థను ప్రస్తుతం ఆయన కుమార్తె లిజ్ టేలర్ కొనసాగిస్తున్నారు. మెరైన్ అభివృద్ధి, మార్కెట్, లీజు కార్యకలాపాలనే కాకుండా సబ్ సీ రోబోటిక్స్, సబ్ మెర్సిబుల్ సిస్టమ్‌ల లీజు, జలాంతర్గత వ్యవస్థల ఇంటిగ్రేషన్, డిజైన్ ఇంజనీరింగ్ సేవలను ఈ సంస్థ అందిస్తోంది. సముద్ర పరిశోధనకు ఉపకరించేందుకు రిమోట్ ద్వారా నిర్వహించే ప్రత్యేక వాహనాలను డోయెర్ నిర్మించి నిర్వహిస్తుంది. సముద్రం లోపల పరిశోధన, పైప్‌లైన్ పనుల తనిఖీలను జరపడానికి ఈ ప్రత్యేక వాహనాలు దోహదపడతాయి. ‘డోయెర్’తో భాగస్వామ్యం ఏపీలో చిన్నతరహా ఓడరేవుల ఆధునీకరణ, అభివృద్ధికి ఎంతగానో ప్రయోజనకారిగా వుంటుందని అధికారులు చెబుతున్నారు. సముద్ర తీరంలో మౌలిక సదుపాయాల కల్పనకు, ఓడరేవు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఉపకరిస్తుందని అంటున్నారు. జాతీయస్థాయిలో ఏర్పాటు చేయనున్న మొత్తం 1095 కిలోమీటర్ల జలరవాణా అభివృద్ధిలో 895 కిలోమీటర్ల మేర ఏపీలోనే వుండటం విశేషం. రానున్న కాలంలో సరకు రవాణాకు ఈ జల రవాణా మార్గాలే కీలకం కానున్నాయి. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంతో జలరవాణా పరిధి మరింత విస్తృతం అయినట్టుగా ప్రభుత్వం భావిస్తోంది.