రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు దాదాపు 10 రోజులపాటు జరగనున్నాయి. అయితే ఇప్పుడు అందరి దృష్తి వైకాపా పార్టీ పై ఉంది. గత సంవత్సర కాలంగా ప్రతిపక్ష పార్టీ వైకాపా అసెంబ్లీ సమావేశాలనూ బహిష్కరించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైములో, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్రలో ఉండగా, వేరే నాయకులకి అసెంబ్లీ బాధ్యతలు ఇవ్వటం ఇష్టంలేక, ఎవరూ అసెంబ్లీకి వెళ్ళద్దు అని ఆదేశాలు జారి చేశారు. దానికి సాకుగా, ఎమ్మెల్యేల అనర్హత పై స్పీకర్ ఒక నిర్ణయం తీసుకునే వరకు సభకు మేము హాజరు కావటం లేదని చెప్పారు.
అయితే ఈ సమావేశాల్లో కూడా అదే పరిస్థితి నెలకొననుంది. కాని ఈ సమావేశాలకు మాత్రం మీరు హాజరు కావాలంటూ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు, వైకాపా అదినేత జగన్ కు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్వయంగా ఫోన్లు చేస్తున్నారు. ఈసారైనా మీరు సభకు వస్తే బాగుంటుందనీ, ప్రజా సమస్యల్ని ఇక్కడ చర్చించుకోవచ్చని, ఇది మీకొక మంచి అవకాశమని ఆయన సూచించారు. కాని వారు సభకు హాజరు కాకూడదని పార్టీ నిర్ణయించిందనీ, ఆ నిర్ణయాన్ని కాదని తాము హాజరు కాలేమని స్పీకర్ తో పలువురు వైకాపా సభ్యులు చెప్పినట్టు సమాచారం. నిజానికి, ప్రతిపక్షంలో ఒక్క సభ్యుడుకూడా లేకుండా, భారతదేశ చరిత్రలో ఎప్పుడూ, ఏ రాష్ట్రంలోను సభ జరగలేదు.
ప్రజల్లో కూడా జగన్ తీసుకున్న నిర్ణయం పై వ్యతిరేకత వచ్చింది. కాని నిజానికి ఎమ్మెల్యేల అనర్హత చర్యలు ఇప్పటికిప్పుడు వైకాపా ఎంత పట్టుబట్టినా జరిగేవి కావు. దీనిపై వైకాపా కోర్టుకు కూడా వెళ్ళింది. దీనిమీద కోర్టు తీర్పు వస్తే తప్పితే స్పీకర్ స్పందించే అవకాశాలు కనిపించడం లేదు. నిజానికి ప్రతిపక్ష పార్టీకు ఈ అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించుకోవడం అనేది ఒక సువర్ణ అవకాశమనే చెప్పాలి. ఎన్నికలకు ఇంకొన్ని నెలలే సమయం ఉంది కాబట్టి, సభలోకి వచ్చి ప్రజా సమస్యల పై అధికార పార్టీ తీరు పై విమర్శలు చేసే అవకాశం దొరుకుతుంది. అసలు ప్రతిపక్షం అంటేనే, అధికార పార్టీ తీరు పై విమర్శలు చేయడం, ప్రజా సమస్యలపై పోరాడటమే. ఆ అవాకాసాన్ని మన ప్రతిపక్షం సరిగ్గా సద్వినియోగం చేసుకోలేపోతుందనే చెప్పాలి. దీనిని బట్టి చూస్తే అసెంబ్లీ హాజరు కాకూడదన్న వైకాపా పార్టీ నిర్ణయం కూడా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఉన్నట్టే చెప్పాలి.