హైదరాబాద్ లో ఉమ్మడి హై కోర్ట్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, అమరావతిలో మన ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ నిర్మాణం ఇప్పటికే మొదలైంది. మరో 5 నెలల్లో నిర్మాణం కూడా పూర్తి కావస్తుంది. ఈ లోపే తెలంగాణా ప్రభుత్వం, కేంద్రం కలిసి, మరో కుట్ర పన్నాయి. హైదరాబాద్ లోనే ఏపికి మరో హైకోర్ట్ కోసం, చోటు ఇస్తాం అంటూ తెలంగాణా ప్రకటించటం, దానికి కేంద్రం అంగీకారం చెప్పటం జరిగిపోయాయి. విచిత్రం ఏమిటి అంటే, 90 వేల కోట్లకు సంబంధించి, హైదరాబాద్ లో ఉన్న వివిధ ఉమ్మడి ఆస్తుల పై మాత్రం, అటు తెలంగాణా కాని, ఇటు కేంద్రం కాని, నోరు మెదపటం లేదు. కాని హైకోర్ట్ విషయంలో మాత్రం, ఎందుకో మరి తొందర పడుతున్నాయి. ఏ కుట్ర దాగి ఉందో మరి.
ఇదే విషయం పై నిన్న విలేకరుల సమావేశంలో చంద్రబాబు స్పందించారు. అమరావతిలో హైకోర్టు భవనం తయారవుతుండగా... ఇప్పటికిప్పుడు హైదరాబాద్‌లో మళ్లీ మరో హైకోర్టు భవనం ఎందుకని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ‘‘డిసెంబరు లేదా జనవరి నాటికి హైకోర్టు భవనాన్ని అప్పగించేస్తాం. మేం స్పష్టతతో ఉన్నాం. పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ మూడు నాలుగు నెలలకు మరో భవనం హైదరాబాద్‌లో అవసరం లేదని అనుకొంటున్నాం. సుప్రీం కోర్టుకు అదే సమాధానం ఇస్తాం’’ అని ఆయన తెలిపారు.
మరో పక్క, ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్)పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, అది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో లేదని ముఖ్యమంత్రి తెలిపారు. ‘‘ఇది మన రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. అప్పట్లో దాదాపు 20 రాష్ట్రాలు ఇందులో చేరాయి. ఇది వద్దనుకొంటే కేంద్రం నిర్ణయం తీసుకోవాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోగలిగే అధికారం లేదు. మేం ఎవరికీ వ్యతిరేకం కాదు. రాష్ట్ర పరిధిలోని అంశాలు పరిష్కరిస్తున్నాం. కానీ... సీపీఎస్ మా చేతిలో లేకపోవడమే సమస్య. పరిస్థితి ఇలా ఉండగా... సీపీఎస్‌పై ఉద్యోగులను కొందరు మభ్యపెడుతున్నారు’’ అని చంద్రబాబు తెలిపారు.