దశాబ్దాల కల సాకారమైంది. గన్నవరం విమానాశ్రయం నుంచి బుధవారం ఉదయం మొదటి పార్శిల్ విమానంలో దిల్లీకి బయలుదేరి వెళ్లింది. డొమెస్టిక్ కార్గో సేవలు ఆరంభమయ్యాయి. మొదటి రోజే ఉదయం నుంచి రాత్రి వరకూ మొత్తం 12 టన్నుల సరకు దిల్లీ, ముంబయి, చెన్నై మూడు నగరాలకు ఎయిర్ కార్గోలో వెళ్లడం, రావడం జరిగింది. పోస్టల్‌శాఖకు చెందిన తొలి పార్శిల్ గన్నవరం విమానాశ్రయానికి ఉదయాన్నే చేరుకుంది. దిల్లీకి కార్గోలో బుక్ చేసి పంపించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి కార్గోలో వెళ్లిన తొలి సరకు ఇదే. అనంతరం.. వరుసగా పార్శిళ్లు రావడం, బుకింగ్ చేయడం జరిగింది. తొలిరోజు ఊహించిన దాని కంటే అనూహ్యంగా స్పందన వచ్చింది. ఇటునుంచి వెళ్లింది, అటునుంచి వచ్చింది కలిపి సరకు 12 టన్నుల వరకూ ఉంది.
ఇలా బుక్ చేసుకోవాలి : గన్నవరం విమానాశ్రయంలోని కార్గో కార్యాలయం వద్దకు సరకును తీసుకెళ్లిన తర్వాత.. ఏ నగరానికి పంపించాలనేది చెబితే.. విమాన సర్వీసుల వేళలు చెబుతారు. కార్గో సేవలు అందిస్తున్న శ్రీపా లాజిస్టిక్స్ కార్యాలయంలో తొలుత సరకును బుక్ చేసుకోవాలి. దానికి సంబంధించిన సర్వీసు రుసుం చెల్లించాలి. అనంతరం అక్కడే ఉన్న ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన కార్యాలయంలో వారు నిర్దేశించిన ధర చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం కార్గో సేవలు అందించే సంస్థ నిర్ధిష్ఠమైన ఒకేరకమైన ధరలు ఉన్నాయి. ఎయిర్‌లైన్స్ మాత్రం ఎయిరిండియా, స్పైస్‌జెట్, ట్రూజెట్ ధరలు కొద్ది తేడాతో ఉన్నాయి. అదికూడా ఇక్కడి నుంచి సరకును పంపించే నగరాన్ని బట్టి రుసుం నిర్ణయించారు.
కిలోలను బట్టి ధరలు..: మూడు రకాల కార్గో సేవలను అందిస్తున్నారు. సాధారణ, ప్రత్యేక, పెరిషబుల్ కార్గోకు ప్రత్యేకంగా ధరలు వసూలు చేస్తారు. సాధారణ కార్గోలో ఏవైనా పంపించేయొచ్చు. దీని ధర కూడా తక్కువే. ప్రత్యేక, పెరిషబుల్‌కు ధర ఎక్కువ ఉంటుంది. ఆహారం పాడైపోకుండా త్వరగా చేర్చేందుకు, విలువైన సరకు వంటివి దీనికిందకు వస్తాయి. పాడైపోయే అవకాశం ఉన్న కూరగాయలు, పండ్లు లాంటి వన్నీ వీటి పరిధిలోనికి వస్తాయి. 10 నుంచి 144 కిలోలకు లోపు ఎంత సరకు ఉన్నా.. ఒకే ధరను కార్గో సంస్థ వసూలు చేస్తోంది. సాధారణ కార్గోకు కనీస ధర రూ.122 చెల్లించాల్సిందే. అంతకు మించితే కిలోకు 83పైసలు వసూలు చేస్తారు. అదే ప్రత్యేక, పెరిషబుల్ కార్గోకు 144 కిలోల వరకూ కనీస ధర రూ.243. దాటితే కిలోకు రూ.1.66పైసలు చెల్లించాలి. ఇదికాకుండా.. ఎక్స్‌రే తదితర అదనపు ఛార్జీలు తీసుకుంటారు. కార్గో సంస్థకు కాకుండా.. ఎయిర్‌లైన్స్‌లో తరలించేందుకు వాటికి అదనంగా ధర చెల్లించాలి. ఎయిరిండియాలో దిల్లీకి సరకును పంపించాలంటే.. కిలోకు రూ.15.25 వరకూ వసూలు చేస్తుంటారు. అదే స్పైస్‌జెట్, ట్రూజెట్, ఇండిగో.. ఇలా వేటికవే కొద్దిగా తేడాతో రుసుం వసూలు చేస్తాయి.