తెలంగాణ ముఖ్యమంత్రికేసీఆర్ తన సహచరుడని తెలుగుదేశం పార్టీలో ఆయన కీలకంగా పనిచేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. కేసీఆర్ గౌరవంగా తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారని పేర్కొన్నారు. అధికార పర్యటనలో భాగంగా ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పర్యటించిన చంద్రబాబు ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశంపార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ తాను వైకాపా ట్రాప్లో పడ్డానని ఆరోపించడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోడీ కన్నా ముందుగా తాను ముఖ్యమంత్రి అయ్యానన్న విషయం ప్రధాని గుర్తుంచుకోవాలని తీవ్ర స్వరంతో హెచ్చరించిన చంద్రబాబు..
ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను మోడీ ప్రశంసించారని చెబుతూ ఆయన ఎవరినైనా ప్రశంసించుకోవచ్చని అయితే ఎదుటి వారిని కించపరిచే విధంగా మాట్లాడడం ప్రధానమంత్రి హోదాలో ఉన్న మోడీకి తగదని చెప్పారు. ఎవరి సర్టిఫికెట్ తనకు అవసరం లేదని అన్నారు. తెదెపాలో కేసీఆర్ పని చేశారని, ఆయన తన సహచరుడని ఈ విషయం పార్టీలోని ప్రతీ ఒక్కరికి తెలుసునని గుర్తుచేశారు. రాజకీయ లబ్ది కోసమే ప్రధాని నరేంద్ర మోడీ వైకాపాను పొడుగుతూ ఆ పార్టీని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో భారతీయ జనతా పార్టీకి ఒక ఓటు, సీటు లేదని, అందుకే అధికారం కోసం తమను వ్యతిరేకిస్తున్న పార్టీలతో మోడీ జత కడుతున్నారని దుయ్యబట్టారు.
భావితరాల భవిష్యత్, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాము రాజీపడేది లేదని రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పునరు ద్ఘాటించారు. ఇందుకోసం ఎలాంటి పోరాటానికైనా తాను సిద్ధ మేనని ఆయన చెప్పారు. రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని విశ్వసించే తాను గతెన్నికల్లో బీజేపీతో పొత్తెట్టుకున్నానన్నారు. ప్రయోజనాలు సిద్ధించే అవకాశాల్లేవని తేలడంతోనే ఎన్డీయే లోంచి బయటకొచ్చామన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే కేంద్రం పై పోరాటం సాగిస్తున్నామన్నారు. ఈ ప్రక్రియలో భాగంగానే కేంద్రంపై అవిశ్వాసం కూడా ప్రతిపాదించామని చెప్పారు. తన పోరాటానికి ప్రజలంతా మద్దతుగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.