రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన చట్టం అమలుపై లోక్‌సభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ తలపెట్టిన ఏపీ బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. రోడ్లపై యధావిథిగా బస్సులు తిరుగుతున్నాయి. బస్ డిపోల వద్ద ఆందోళన చేపడుతున్న వైసీపీ నేతలను, కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇదే సమయంలో, ఈ బంద్ పై, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించారు. ఎంపీ పదవులకు రాజీనామాలు చేసి రోడ్లపై తిరుగుతున్నా ప్రజలు పట్టించుకోవడం లేదన్న అక్కసుతోనే వైకాపా బంద్ పేరుతో రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.
కేంద్రంలో భాజపా ప్రభుత్వం విభజన హామీలు నెరవేర్చకుండా ఇబ్బంది పెడుతుంటే.. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బంద్‌ల పేరుతో మరింత నష్టం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రాష్ట్రాన్ని బంద్‌ల పేరుతో ఇబ్బంది పెట్టడం సమంజసం కాదన్నారు. కేంద్రం చేసిన తప్పులకు రాష్ట్రాన్ని శిక్షించడం ఏంటని వైకాపా నేతలను నిలదీశారు. కేంద్రంపై పోరాటం వదిలేసి రాష్ట్రంలో బంద్ చేపట్టడం వల్ల సాధించేది ఏమిలేదని చంద్రబాబు ప్రతిపక్ష పార్టీకి హితవు పలికారు. వీటన్నింటిపై ప్రజలను చైతన్యపరచాలని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అశాంతి సృష్టిస్తే పెట్టుబడులు రావని... యువతకు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోతారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ఆలోచనలు రాష్ట్రానికి వచ్చే రాబడిని దెబ్బతీసేలా ఉన్నాయని ఆక్షేపించారు. రాష్ట్రానికి నష్టం చేయడం ద్వారా కేంద్రంపై పోరాటాన్ని నీరుగార్చొద్దని హితవు పలికారు. మన వేలితో మన కళ్లు పొడవవద్దని.. రాష్ట్రంలో అశాంతి సృష్టించవద్దని హెచ్చరించారు.
తెదేపా ఎంపీలతో చంద్రబాబు ఈరోజు ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాయకత్వ సామర్ధ్యం చూపడానికి ఇదొక అవకాశమన్న చంద్రబాబు... దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సభలో ఆందోళనలు కొనసాగించడంతో పాటు సభ వెలుపల కూడా నిరసనలు తెలపాలని ఎంపీలకు సూచించారు. పోరాట స్ఫూర్తిని ప్రదర్శించి చట్టాన్ని ఎందుకు అమలు చేయరని కేంద్రాన్ని నిలదీయాలన్నారు. విభజన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. హామీలు నెరవేర్చేవరకు వదిలిపెట్టమని... తెలుగు పౌరుషం చూపిస్తామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం కూడా పన్నులు చెల్లిస్తున్నందున సంక్షేమం చూడాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ... అభివృద్ధి అనేది రాజకీయాలకు అతీతంగా జరగాలని ఆకాంక్షించారు.