నవ్యాంధ్ర ఆర్ధిక రాజధాని విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ కు, తూర్పు నౌకాదళం ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. రోజుకు 5 గంటలపాటు పౌర విమానాల రాకపోకలను నిషేధించే నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా అవతరిస్తున్న విశాఖ ప్రగతికి తీవ్ర ఇబ్బందికరంగా మారిన ఈ నిర్ణయంతో చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. ఏటా 24 లక్షల మందికి పైగా ప్రయాణికుల్ని దేశ, విదేశీ గమ్యస్థానాలకు చేరుస్తూ కీలక గుర్తింపు తెచ్చుకున్న ఈ విమానాశ్రయంలో రాకపోకలను నిషేధిస్తే ప్రయాణికులపై ఆర్థిక భారం పడటమే కాకుండా.. సమయం వృథా అవుతందని, విశాఖ ప్రగతికి ఆటంకం అని నేవీ అధికరాలుతో చెప్పారు. శుక్రవారం విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. రాత్రి తిరుగు ప్రయాణ సమయంలో నౌకాదళ, విమానాశ్రయ అధికారులు, విశాఖ డెవలప్మెంట్ ఫోరం, అపాటా సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
చంద్రబాబుతో చర్చలు తరువాత, విశాఖ విమానాశ్రయంలో నిర్దేశిత సమయాల్లో పౌర విమానాల రాకపోకలపై నౌకాదళం విధించిన ఆంక్షలు రద్దయ్యాయి. ఇకపై తమ నుంచి ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవని నేవీ అధికారులు స్పష్టం చేశారు. చంద్రబాబుతో భేటీలో ఆంక్షల్ని విరమించుకున్నట్లు నౌకాదళ అధికారులు ప్రకటించారు. నెలరోజులుగా దీనిపై దుమారమే రేగింది. దిల్లీ, కోల్‌కతా మీదుగా తిరిగే విమానాల్ని రద్దుచేస్తూ కొన్ని విమానయాన సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఒకట్రెండు మినహా విశాఖ నుంచి తిరిగే అన్ని విమానాల మీదా ఆంక్షల ప్రభావం పడింది. సమయాలను మార్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనివల్ల విశాఖ అభివృద్ధి గాడి తప్పుతుందని విశాఖ డెవలప్మెంట్ ఫోరం, అపాటా, ఇతర సంస్థల సభ్యులు ఆందోళనకు దిగారు.
గత నెలలో విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఎంపీ హరిబాబు నేతృత్వంలో విమానాశ్రయ సలహా సంఘం సమావేశమై నిషేధాజ్ఞలను ఎత్తివేయాలంటూ తీర్మానం చేసి నౌకాదళ అధికారులకు పంపింది. అవసరమైతే నౌకాదళానికి ప్రత్యేక రన్‌వే ఏర్పాటుచేసేలా 34 ఎకరాల స్థలాన్ని పోర్టు ట్రస్టు నుంచి ఇప్పిస్తామని తీర్మానించింది. దీంతో నౌకాదళ అధికారులు సానుకూల ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, నేవీ వైస్ అడ్మిరల్ ఎంఎస్ పవార్‌కు విశాఖ డెవలప్మెంట్ ఫోరం, అపాటా సభ్యులు ఒ.నరేష్కుమార్, డీఎస్ వర్మ, కె.కుమార్‌రాజా అభినందనలు తెలిపారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, విమానాశ్రయ డైరెక్టర్ ప్రకాష్‌రెడ్డి తదితరులు భేటీలో పాల్గొన్నారు.